మిషన్ డోలోను నిలువరించి దేశ ప్రజలను కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్‌కు హైదరాబాద్‌లో సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రప్రభుత్వంలోని పెద్దలు సహా వివిధ రంగాలకు చెందిన అతిరథులు హాజరై రుద్ర అండ్ టీమ్ సాహసాలను కొనియాడారు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి రుద్రలాంటి దేశభక్తుడు మరెవ్వరూ లేరని, ఏ స్వార్థంలేకుండా రుద్ర చేసిన ఈ సాహసం చరిత్రలో నిలిచిపోతుందంటూ ఉపన్యాసాలు హోరెత్తించారు.
చివరగా సత్కారాన్ని అందుకొన్న రుద్ర మాట్లాడుతూ.. మిషన్ డోలోలో సాయపడిన తన టీమ్ మెంబర్స్‌తో పాటు ప్రతి ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేసుకొన్నాడు. ఈ క్రమంలో తనలాంటి దేశభక్తులు, నిస్వార్థపరులు ఎవరూలేరన్న కితాబుపై రుద్ర మాట్లాడుతూ.. ‘నిజానికి నేను చేసింది సముద్రతీరంలోని ఓ ఇసుక రేణువంత. అదికూడా నాకు అవకాశం వచ్చిందిగనుకనే నేను ఈ పని చేయగలిగాను. మన దేశానికి స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ జీవితాలనే త్యాగం చేశారు. వారిముందు నేనెంత?? ఇలా త్యాగం చేసినవారిలో కొందరు వెలుగులోకి వచ్చారు. మరికొందరు రాలేకపోయారు. నేను ప్రభుత్వ వేతనం తీసుకొంటున్నా. అందుకే, నా డ్యూటీ నేను చేశానని అనుకొంటున్నా.. అయితే, దేశం కోసం తన భర్తను కూడా చంపుకొని ఓ మహిళ ఈ దేశానికి తన సర్వస్వాన్ని అర్పించారు. స్వాతంత్య్రం వచ్చాక రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ ఏ స్వార్థంలేకుండా పూలు అమ్ముకొని బతికారు.
8 ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఉస్మానియా దవాఖానలో ఆమెను నేను నిర్జీవంగా చూశా. ఇప్పటికీ, ఆమె చిత్రం నాకు గుర్తుంది. ఆమె త్యాగం ముందు.. నా త్యాగం ఏపాటిది?? ఇలా దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారు ఎందరో ఉన్నారు. వాళ్లందరి గురించి ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ, ఆమె గురించి ఇప్పుడు మీకు చెప్పాలనిపిస్తున్నది!’ అంటూ రుద్ర కొనసాగించాడు. హాల్ అంతా నిశ్శబ్దం. ప్రతిఒక్కరూ ఆసక్తితో వింటున్నారు. రుద్ర కొనసాగించాడు. ‘అది 1998వ సంవత్సరం జూలై 26వ తేదీ. ఓ పనిమీద మా నాన్నగారితో నేను ఉస్మానియా హాస్పిటల్‌కు వెళ్లా. అక్కడ ఓ 96 ఏండ్ల వృద్ధురాలు చనిపోయి ఉంది. ఇరుగుపొరుగువాళ్లు కొద్ది రోజుల కిందట ఆమెను దవాఖానలో చేర్పించారట. పాపం.. అనారోగ్యంతో పాటు వృద్ధాప్యం.. చివరకు ప్రాణంపోయింది. మృతదేహాన్ని అప్పగించడానికి అధికారులు ఆమె గురించి ఆరా తీస్తున్నారు. చార్మినార్ దగ్గర ఓ బస్తీలోని గుడిసెలో ఉండేదట. ఆసక్తితో నాన్నతో పాటు నేనూ అక్కడికి వెళ్లా. ఆ ఇంట్లో ఓ పాత ట్రంకు పెట్టె కనిపించింది.అందులో ఏవేవో కాగితాలు కనిపించాయి. వాటిని చదువుతున్న నాన్నగారి కండ్లల్లో వచ్చిన కన్నీటిని ఇప్పటికీ నేను మరిచిపోలేను’ అంటూ గద్గద స్వరంతో కాసేపు ఆగిపోయిన రుద్ర నీళ్లు తాగి మళ్లీ కొనసాగించాడు.
‘1902లో యూపీలో ఆమె పుట్టింది. తల్లిదండ్రులు చనిపోవడంతో ఎనిమిదేళ్లప్పుడు కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి దత్తత తీసుకొన్నాడు. ఆంగ్లేయులకు వ్యతిరేక ఉద్యమాలు ఆమెను చిన్నతనంలోనే ఆకర్షించాయి. ఈక్రమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారథ్యంవహిస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలుసుకొని ఆ రెజిమెంట్‌లో చేరింది. గూఢచారిగా ఆమె ప్రతిభ చూసిన ఫౌజ్ అధికారులు నేతాజీ రక్షణ బాధ్యతలను అప్పగించారు. ఆమె వయసుకు రావడంతో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి అయిన వ్యక్తినిచ్చి పెండ్లిచేశాడు దత్తత తండ్రి. భర్త ఉన్నత ఉద్యోగి అనే ఆమెకు తెలుసు. అయితే, నేతాజీని హత్య చేయడానికే ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం నియమించిందని ఆమెకు తర్వాత తెలిసింది. నేతాజీ ఆచూకీ కోసం ఆమెను భర్త రోజూ హింసించేవాడు. ఆమె ఎంతకూ చెప్పలేదు. ఈ క్రమంలో ఓ రోజు నేతాజీని కలిసేందుకు వెళ్లిన ఆమెను భర్త అనుసరించాడు. దూరంగా కనిపించిన నేతాజీపై కాల్పులు జరిపాడు. ఇంతలో ఆమె అడ్డుపడింది. అయినా భర్త ఆగలేదు. దీంతో నేతాజీని కాపాడాలన్న ఉద్దేశంతో తన పసుపు, కుంకుమలు పోతాయని తెలిసినా మరోక్షణం ఆలోచించకుండా భర్తను ఆమె పొడిచి చంపింది. ఇది తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు జీవితఖైదు విధించి అండమాన్ జైలుకు తరలించింది. నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటూ రోజూ ఆమెను హింసించేవారు. ఆచూకీ చెప్తే బెయిల్ ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. అయినా ఆమె ఒప్పుకోలేదు.
ఓసారి ఓ అధికారి ఆమెను తీవ్రంగా హింసిస్తుండగా ఆ బాధ తట్టుకోలేక ఆమె నోరు విప్పింది. ‘ఆయన ఎక్కడో కాదు.. నా గుండెల్లో ఉన్నాడం’టూ సమాధానమిచ్చింది. కోపోద్రిక్తుడైన అధికారి ‘నీ గుండెలను చీల్చి నేతాజీని బయటకు తీస్తా’నంటూ కత్తితో ఆమె రొమ్ములను కోశాడు. అయినప్పటికీ ఆమె నోరుమెదపలేదు. అయితే, కత్తి మొండిగా ఉండటంతో ఆమె ఛాతీ మీద లోతుగా దిగలేదు. దీంతో కోపంతో ఆ అధికారి సుత్తితో ఆమె తలమీద కొట్టేసి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. జైలు నుంచి విడుదలైన ఆమె.. హైదరాబాద్ చేరుకొని చార్మినార్ ప్రాంతంలో పూలమ్ముకొని జీవనం సాగించేది. దేశం కోసం తాను ఈ త్యాగం చేశానని ఎన్నడూ ఆమె ఎవరికీ చెప్పలేదు. ఆమెను ఎవ్వరూ అడగలేదు. చివరకు.. ఓ కాగితం ఆమె త్యాగాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసింది. ఈమే కాదు.. ఇలాంటి వందలాది మంది ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ల ముందు నేనెంతా??’ అంటూ భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యాడు రుద్ర. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న రుద్ర నిరాడంబరతను మెచ్చుకొంటూ.. ఆ నిస్వార్థమూర్తిని తలుచుకొంటూ ఆ హాల్ అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఇంతకీ, రుద్ర చెప్పిన ఆ నిస్వార్థ త్యాగశీలి ఎవరో మీరు కనిపెట్టారా?
ఆమె పేరు నీరా ఆర్య. భారత జాతీయ సైన్యంలో మొదటి మహిళా గూఢచారి ఈమెనే. నీరా జీవిత కథ ఆధారంగానే ‘ఆజాద్ భారత్’ పేరిట ఇటీవల బాలీవుడ్లో ఓ చిత్రం విడుదలైంది. ‘ఫస్ట్ లేడీ స్పై’, ‘మేరా జీవన్ మేరా సంఘర్ష్’, ‘నీరా ఆర్య ఏక్ వీరాంగణ’, ‘ది సర్పెంట్ అండ్ ది ప్యాట్రియాట్’, ‘ఆజాద్ హింద్ ఫౌజ్ కే గుమ్నామ్ సైనిక్’ పేరిట నీరా ఆర్య జీవిత కథతో పలు పుస్తకాలు కూడా వెలువడ్డాయి.