నల్లబెల్లి, ఆగస్టు 8 : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభ నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన ఉద్యమ దివిటీ పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కర్మను ఆదివారం నల్లబెల్లిలో కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమ సహచరుడు పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆదివారం నల్లబెల్లికి రానున్నారు. దీంతో పెద్ది స్వగృహం వద్ద ఏర్పాట్లను ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.

అలాగే పెద్దిని స్మరించుకునేందుకు 10న నల్లబెల్లిలో జరిగే సంస్మరణ సభకు అధిక సంఖ్యలో హాజరు కానున్న ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా సభ నిర్వహణ బాధ్యులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గర ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలితోపాటు వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు, వాహన పార్కింగ్, భోజన వసతి కోసం జరుగుతున్న పనులను ఎర్రబెల్లితోపాటు మాజీ ఎంపీ బోయినపెల్లి వినోద్‌కుమార్ శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సతీశ్‌రెడ్డి, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్, మాజీ ప్యాక్స్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, ఊడుగు ప్రవీణ్గౌడ్తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.