హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ శాఖలో ఇటీవల నిర్ణయించిన ఉన్నతస్థాయి ప్రమోషన్లలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమోషన్లు కల్పించడంతోపాటు సీటుకో రేటు చొప్పున పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సైతం సిద్ధమయ్యారని బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగవర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. సంక్షేమభవన్‌లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇటీవల డీపీసీలో నిర్ణయించిన ప్రమోషన్లపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖలో ఆరు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
హనుమకొండ, కరీంనగర్, నల్లగొండ డీడీ పోస్టులతోపాటు గురుకుల సొసైటీలో డిప్యూటీ సెక్రటరీ పోస్టులు రెండు, బీసీ కార్పొరేషన్లో జనరల్ మేనేజర్ (జీఎం) పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించారు. అందులో డిస్ట్రిక్ట్ బీసీవెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఏండింటికి సంబంధించిన ఫైలుపై చర్చించారు. వీరిలో ఒకరికి మినహా మిగతా ఆరుగురు డీబీసీవోలకు డీడీలుగా ప్రమోషన్లు కల్పిస్తూ ఆమోదం లభించింది.
ఉత్తర్వులు రావాల్సి ఉన్నది. ఈ ప్రమోషన్లపై సంక్షేమభవన్ వర్గాల నుంచి, బీసీ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలు చోటుచేసుకున్నాయని, పలువురు అనర్హులకు ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలొస్తున్నాయి. కొంతమంది అధికారుల గత సర్వీస్ రికార్డులు, విచారణలు, పోస్టింగ్‌లపై పెండింగ్‌లో ఉన్న అంశాలను తొక్కిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్ పొందిన ఒక అధికారి గతంలోనే షరతులపై ప్రమోషన్ పొందారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కుల ధ్రువీకరణపై విచారణకు లోబడి ప్రమోషన్ ఉంటుందని గతంలోనే కమిటీ పేరొన్నదని, ఇప్పటికీ దానిపై విచారణ కొనసాగుతున్నదని, అయితే విచారణ పూర్తికాకముందే ప్రస్తుతం మరోసారి ప్రమోషన్ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అంశంపై అధికారిక ఫైల్ నోటింగ్స్, విచారణ నివేదికలు ఏవీ బయటపెట్టలేదని తెలుస్తున్నది. ప్రమోషన్ కల్పించిన మరో అధికారిపై కూడా అనేక పరిపాలనా వ్యవహారాలు, ప్రొటోకాల్, విధులకు గైర్హాజర్ తదితర అంశాలపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన విచారణలు ఉన్నాయని, వాటిని తొక్కిపెట్టారని సంక్షేమభవన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరొక అధికారిపై హాస్టళ్ల నిర్వహణ, బిల్లుల చెల్లింపులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు, విదేశీ విద్యా పథకాలు తదితర అంశాల్లో అవకతవకలపై అధికారిక విచారణలు జరిగాయని, కానీ అవేవీ బయటపెట్టకుండా, క్లీన్చిట్ రాకముందే ప్రస్తుతం దొడ్డిమార్గంలో ప్రమోషన్ కల్పించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలాఉంటే ప్రమోషన్ల ఇవ్వడంతోపాటు ఇప్పటికే వారిలో పలువురిని ఉన్నతస్థాయి పోస్టులకు సైతం నిర్థ్ధారించారని తెలుస్తున్నది. వారికోసం ప్రత్యేకంగా చాంబర్లను సైతం సిద్ధం చేస్తున్నారని సంక్షేమభవన్ వర్గాలు వివరిస్తున్నాయి. బీసీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ పోస్టు కోసం ఇప్పటికే ఒకరిని ఎంపిక చేశారని తెలుస్తున్నది. ఆయనకు ఇప్పటికే గదిని కేటాయించడంతోపాటు ఆధునీకరించారని సంక్షేమభవన్ వర్గాలు వివరిస్తున్నాయి. అధికారిక పోస్టింగ్ ఉత్తర్వులు వెలువడకముందే పేర్లు చర్చకురావడమేకాదు, స్వయంగా సదరు అధికారులే బాహాటంగా సహచర అధికారుల వద్ద చెప్పుకొంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఇతర కీలక పోస్టులకు సైతం పేర్లు ఖరారయ్యాయని తెలుస్తున్నది.
ప్రస్తుతం పోస్టింగ్‌లకు సంబంధించి ఫైలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు చేరిందని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సమాచారం. ప్రమోషన్ల తీరుపై సంక్షేమభవన్ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లు పొందిన అధికారులపై పెండింగ్‌లో ఉన్న విచారణలు ఎన్ని? విజిలెన్స్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలేమిటి? విదేశీ విద్య, హాస్టల్ నిధులు, ఔట్ సోర్సింగ్ వేతనాలపై ఆడిట్ నివేదికల్లో ఏమున్నది? పనితీరు సరిగా లేని అధికారులకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యమేందని సంక్షేమభవన్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయా అంశాలపై బీసీ సంక్షేమ శాఖ, ఉన్నతాధికారులు తక్షణం స్పందిస్తే వాస్తవాలు వెలుగు చూస్తామని సూచిస్తున్నారు. అప్పటివరకు పోస్టింగ్‌లను నిలిపివేయాలని ఉద్యోగవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.