‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
ధాత్రి అద్దంలో చూసుకుంది. తన ప్రతిబింబంపై ఓ మసక తెర కప్పినట్లు అనిపించింది. ఆమె తలపై ఎవరివో చేతులు వేగంగా కదులుతూ ఉన్నాయి. ఆమె కాళ్లనూ, చేతులనూ బంధించిన తాళ్లు ఆ పరాయి చేతులలో ఉండటంతో.. తనో తోలుబొమ్మలా ఆడుతూ ఉంది. తన గర్భధారణ ఓ ప్రహసనంగా ఎందుకు మారింది? గర్భం బయట జరిగింది గర్భధారణ అవుతుందా? అందుకే.. టెస్ట్‌ట్యూబ్ బేబీ అన్నారా? అలా పుట్టిన బిడ్డకు పరీక్ష నాళికే తల్లి అవుతుంది కానీ, తను కాదు కదా? ఇందులోని ఏ ప్రశ్నకీ ఆమె దగ్గర సమాధానం లేదు. చూడటానికి పడకగది బహు విశాలం. కానీ, అంతా ఇరుకిరుకుగా అనిపిస్తోంది.. గదిలోనా? మదిలోనా?
కాలిఫోర్నియా ఫెర్టిలిటీ క్లినిక్ నుంచి వచ్చిన మెయిల్‌ని మళ్లీ చదివింది. ‘మీ వంద ఎంబ్రియోలకు స్కానింగ్ పూర్తయింది. కృత్రిమ మేధ చేసిన విశ్లేషణ ఆధారంగా అత్యుత్తమ పిండాలను ఎంపిక చేశాం. అపాయింట్మెంట్ తీసుకుని క్లినిక్‌కి వచ్చినట్లయితే, తదుపరి చర్యల గురించి మాట్లాడుకోవచ్చు’.. అదీ ఆ ఇంగ్లిష్ మెయిల్ సారాంశం!
చివర్లో.. ‘డాక్టర్ ప్రతిభ అడపా’ అనే డిజిటల్ సంతకం. దాని కింద ‘ఎంబ్రియాలజిస్టు’ అని ఉంది. అలవాటు ప్రకారం తనూ, భర్త అభిరాం ఇంగ్లిష్ పదాలు ధారాళంగా వాడేస్తుంటారు కానీ, డాక్టర్ ప్రతిభ మాత్రం ప్రయత్నపూర్వకంగా వీలైనంత మేరకు తెలుగు పదాలనే ఉపయోగిస్తుంది. ధాత్రి ఆమె దగ్గర చికిత్స తీసుకోడానికి అది కూడా ఒక కారణం.
ఇంతకాలంగా తను తల్లి కాలేకపోవడానికి కారణం శారీరక లోపాలా? కార్పోరేట్ క్లినిక్ అధిక మొత్తంలో డబ్బు గుంజడానికి విసిరిన వలలో తనూ, భర్తా చిక్కుకున్నారా? ఇది ఫెర్టిలిటీ స్కానా? ఫెర్టిలిటీ స్కామా? తన శరీరంపై తన నియంత్రణ ఏ మేరకు?…
ఆలోచనల సుడిగుండంలో ధాత్రి చిక్కుకుంది. ఆ వంద ఎంబ్రియోలూ గ్రహాల్లా తన చుట్టూ పరిభ్రమిస్తూ.. ‘అమ్మా! మాలో ఎంతమందికి జన్మనిస్తావ్? మిగిలిన వాళ్లను ఏం చేస్తావ్??’ అని అడుగుతున్నట్లు అనిపించింది. తనేమీ గాంధారి కాదు.. వంద మందికీ జన్మనివ్వడానికి! ఇదెంత తీవ్ర సమస్యో ఆమెకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. తన భర్త కృత్రిమ మేధస్సుపై అంధవిశ్వాసం పెంచుకున్న కళ్లున్న ధృతరాష్ట్రుడు. తనేమో కళ్లకి గంతలు కట్టుకోకుండానే.. గాంధారిలా భర్తని గుడ్డిగా అనుసరించి, వంద ఎంబ్రియోల స్క్రీనింగుకు అంగీకరించింది. వెంటనే భర్తకు ఫోన్ చేసింది ధాత్రి. ఫోన్ ఎంతకీ ఎత్తకపోవడంతో అతను మీటింగులో ఉన్నాడేమో అనుకుని, ఫోన్ కట్ చేసింది.
హార్మోనల్ అసమానతలకు తోడు ఈ మెయిల్ కలిగించిన ఆందోళనతో ఆమె ఒంట్లో వేడి సెగలు ఎక్కువయ్యాయి. రిమోట్ అందుకుని ఏసీ ఆన్ చేసింది.మాస్టర్ బెడ్రూమ్లోని ఫ్లోర్-టు-సీలింగ్ విండోస్ నుంచి దూరంగా కనిపిస్తున్న శాంతాక్రూజ్ పర్వతశ్రేణి.. ఇంతకు ముందులా ఆమెకు పరవశం కలగజేయడం లేదు. పచ్చదనం మాయమైంది.. ఆ పర్వతశ్రేణి పైనా, తన జీవితంలోనూ. ఆమెకు పీసీఓఎస్ సమస్య. భర్తకు స్పెర్మ్ కౌంట్ తక్కువ. దాంతో సహజ గర్భధారణకు తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి. ప్రకృతి చేయాల్సిన పని ఇప్పుడు ప్రయోగశాల చేతుల్లోకి వెళ్లిపోయింది.అభిరాం వర్క్డెస్క్ వంక చూసింది. గుడ్లగూబల ప్రపంచం ప్రత్యక్షమైంది. మౌస్, ఫిడ్జెట్ స్పిన్నర్, ల్యాప్‌టాప్, వాల్‌పేపర్… అన్నిటిపైనా గుడ్లగూబల బొమ్మలే!
ఒక్కదాన్నే ఉన్నానన్న భయంతో ధాత్రి శరీరంలో వణుకు ఎక్కువైంది. క్రయోస్టోరేజ్ గదిలో చలి ఎముకలకు తాకింది. లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు నిశ్శబ్ద శవపేటికల్లా భయపెడుతున్నాయి. వీటిలో ఏ ట్యాంకులో తన ఎంబ్రియోలున్నాయా!? అనే ఆలోచనలో పడింది. ‘అమ్మా… అమ్మా…’ అంటూ అనేకమంది చిన్నారుల గొంతులు ఒక్కసారిగా వినిపించాయి.
‘గుడ్లగూబంటే నీకెందుకంత వ్యామోహం?’ అని ధాత్రి ఒకసారి అతన్ని నిలదీసింది.
‘నీకు నెమలి అంటే ఎందుకిష్టం?’ అని ఎదురు ప్రశ్న వేశాడు.
‘మగ నెమలికి తన సహచరిపై ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో బాగా తెలుసు’ అని చెప్పాలనిపించింది కానీ, వాదన పెంచడం ఇష్టం లేక..
‘అందమైన పక్షి కదా! అందుకు ఇష్టం’ అంది. దానికి అతను..
‘ఔల్.. తెలివితేటలకి చిహ్నం! స్మార్ట్ పీపుల్ గుడ్లగూబని ప్రేమిస్తారు’ అన్నాడు.
‘ప్రేమించడం కాదు. ఇతను గుడ్లగూబలతో ఏకంగా సహజీవనమే చేస్తున్నాడు. తనుకూడా
ఓ నిశాచర జీవి కాబట్టి. వేరే జీవిని చంపికానీ బతలేని పక్షి అది. దానిని ప్రేమించడం వెనుక ఏదో క్రౌర్యం దాగి ఉంటుంది’ అని అనుకుంది ధాత్రి. ఫెర్టిలిటీ క్లినిక్‌కి కాల్ చేద్దామనిపించి, మొబైల్‌ని చేతిలోకి తీసుకుంది. కొంతసేపటికి కస్టమర్ కేర్ మేనేజర్ అందుబాటులోకి వచ్చాడు. ధాత్రి తన పేరూ, ఐడీ నంబర్ చెప్పి.. తనకు వెంటనే ఎంబ్రియాలజిస్టు డాక్టర్ ప్రతిభతో అపాయింట్మెంట్ కావాలని చెప్పింది. ఆ మేనేజర్ ప్రస్తుతం స్లాట్లు ఏవీ లేవనీ, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చాడు.
ధాత్రి బెడ్ మీద కూర్చుని ఎదురుగా ఉన్న అద్దంలోకి చూసింది. అద్దంలోని తన ప్రతిబింబమే తనకున్న ఏకైక తోడు. ముప్పై ఏడేళ్లకే వృద్ధాప్యఛాయలు పొటమరించాయి. ఒకప్పుడు మిస్ కాలేజీగా ఉన్న తను.. ఇప్పుడు మిసెస్ లేజీగా తయారైంది. పరుపు చుట్టలా ఉబ్బిన శరీరం, డబుల్ చిన్, కళ్ల కింద చీకటి వలయాలు, మూతి మీదా గెడ్డం మీదా రోమాలు… ఇవీ తను సాధించింది. రకరకాల మాత్రలు, హార్మోన్ ఇంజెక్షన్లు… ఒకటా రెండా…ఫార్మసీ అంతా తన ఒంట్లోనే తిష్టవేసుకుంది. అంతలో గ్యారేజీలో కార్ లాక్ చేసిన శబ్దం వినిపించడంతో.. సీసీ టీవీ మానిటర్లోకి చూసింది. అభిరాం ఇంట్లోకి రావడం కనిపించింది. బెడ్రూమ్లోకి అడుగు పెడుతూనే..
“ధాత్రీ! నాకు చాలా విసుగ్గా ఉంది. వరసపెట్టి ఎస్కలేషన్స్. దాంతో నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయా. నేను ల్యాప్‌టాప్ తెరవకముందే చెప్పు.. దేనికోసం ఫోన్ చేశావో?” అంటూ, టై వదులు చేసుకున్నాడు.
“ఈ మెయిల్ చూడూ.. ఫెర్టిలిటీ క్లినిక్ నుండొచ్చింది” అంటూ, తన మొబైబ్లో సేవ్ చేసుకున్న మెయిల్‌ని అతనికి చూపించింది. అభిరాం వెంటనే..
“ఆ మెయిల్ నాక్కూడా వచ్చింది. ఇంతకాలానికి ఎంబ్రియోల స్క్రీనింగు పూర్తయింది. గుడ్ న్యూసే కదా!” అన్నాడు తాపీగా.
“అభీ! నాకిది గుడ్ న్యూస్‌లా అనిపించడం లేదు. ఎంబ్రియోల స్క్రీనింగుకు ఒప్పుకొని, తప్పు చేశామేమో అనిపిస్తోంది”
“ఎలానూ ఐవీఎఫ్‌కి వెళుతున్నాం కాబట్టి, అన్నివిధాలా అనుకూలమైన ఎంబ్రియోల కోసం స్క్రీనింగ్ చేయడం మంచిదే కదా! సహజంగా గర్భం దాల్చితే ఈ అవకాశం ఉండేదే కాదు” అంటూ కబోడ్ నుంచి నైట్ డ్రెస్ తీసుకుని, బాత్రూమ్కి ముందున్న డ్రెస్ ఛేంజింగ్ రూమ్‌కి వెళ్లేడు. ధాత్రి ఫ్రిడ్జ్‌లోంచి ఫ్రూట్‌జ్యూస్ బాటిల్‌ని బయటికి తీసి.. రెండు గాజు గ్లాసుల్లో పోసింది.అభిరాం ఫ్రెష్ అయ్యి.. బెడ్రూమ్లోకి వచ్చాడు. ధాత్రి జ్యూస్ గ్లాసు ఒకటి అతనికందించి, రెండోది తను తీసుకుంది. నెమ్మదిగా సిప్ చేస్తూ..
“అభీ… ఎంబ్రియాలజిస్ట్ ప్రతిభతో ఎల్లుండి మధ్యాహ్నం మూడు గంటలకి అపాయింట్మెంట్ దొరికింది. నేను వెళ్లి ఆమెతో మాట్లాడి నా అనుమానాలన్నిటినీ క్లియర్ చేసుకుంటాలే! నీకు లీవు దొరకడం కష్టం కదా!” అంది.
“ఎల్లుండా!…” అంటూ అభిరాం మొబైల్లోని క్యాలెండర్ చూసి..
“ఫ్రైడే కదా! నేనూ వస్తా… ఆ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా” అన్నాడు.
“అభీ! నీతో కాదులే! పేరుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, అందులో వర్క్ తప్ప హోమ్ అంటూ ఏమీ ఉండదు. ఆఫీసులోకంటే ఎక్కువ బిజీగా ఉంటావు”
“ధాత్రీ! నీదీ సాఫ్ట్వేర్ జాబే కదా! మనకు ఇవన్నీ తప్పవు. నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్!” అంటూ అభిరాం వర్క్ డెస్క్ ముందున్న చెయిర్లో కూర్చుని, ల్యాప్‌టాప్ తెరిచాడు. ధాత్రికి గతం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది…
అభిరాంకి అమెరికాలో ఉద్యోగ అవకాశం రావడంతో, తను ఒక్కడూ వెడితే ఖర్చులు తగ్గుతాయనీ.. ఓ అయిదేళ్లు కష్టపడి సంపాదించుకుంటే, ఆపైన కాలు మీద కాలు వేసుకుని కులాసాగా జీవించవచ్చని చెప్పి వెళ్లాడు. ఎనిమిదేళ్లయినా భర్త తిరిగి రాకపోయేసరికి, అతణ్ని అమెరికా ఊబినుంచి బయటికి లాగుదామని వెళ్లి.. ధాత్రి మరింత లోతులోకి కూరుకుపోయింది. సింహావలోకనం చేసుకుంటే, తన వైపునుంచి జరిగిన తప్పులు కూడా తక్కువేమీ కాదని ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి క్షణాలలో పదేపదే తల్లి వసుంధర తలంపులోకి వస్తుంది. వసుంధర పుట్టినిల్లూ, మెట్టినిల్లూ మల్లాం గ్రామం కావడంతో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఊరు వదిలి రావడానికి ఇష్టపడదు. కూతురు ఎంతగా పట్టుబట్టినా, చుట్టపు చూపుగా అయినా అమెరికాలో అడుగుపెట్టడానికి ఆమె ఆసక్తి చూపలేదు.
“కూర్చోండి.. ఎలా ఉన్నారు?” అంటూ ఫైల్ తెరిచింది డాక్టర్ ప్రతిభ తన ల్యాప్‌టాప్ తెరిచి, కొన్ని గుండ్రటి చిత్రాలను ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై ప్రొజెక్ట్ చేసింది. వాటి లోపల ఏవో చిన్నచిన్న క్రిముల్లాంటివి మెదులుతున్నట్లుగా ధాత్రికి అనిపించింది. డాక్టర్ ప్రతిభ గ్రీన్ లేజర్ లైట్ పెన్నుతో స్క్రీను పైకి చూపిస్తూ..
“కృత్రిమ మేధ విశ్లేషణ ప్రకారం మొదటి వరుసలో ఉన్న ఎంబ్రియోలు ఎక్కువ మేధస్సు కలిగినవి. రెండో వరుసలోనివి మంచి భావోద్వేగ నియంత్రణ కలిగినవి. మూడో వరుసలోనివి చక్కని ఆరోగ్యకరమైనవి. నాలుగో వరుసలో ఉన్నవి అధిక సృజనాత్మకత కలిగినవి. ఇప్పుడు చెప్పండి.. వీటిలో మీరు ఏ ఎంబ్రియో కావాలనుకుంటున్నారు?” అంది.
“డాక్టర్.. హై ఐక్యూ ఎంబ్రియో! అందులో రెండో ఆలోచనే లేదు. ఎవరైనా అధిక తెలివి కలిగిన బిడ్డనే కోరుకుంటారు కదా!” అన్నాడు అభిరాం.
“అభీ! తొందరపడకు. ఐన్‌స్టీన్ లాంటి మేధావి కూడా సృజనాత్మకతకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. బెటర్ టు గో ఫర్ హై క్రియేటివిటీ ఎంబ్రియో” అంది ధాత్రి. డాక్టర్ ఇద్దరి వంకా అయోమయంగా చూసింది.
“డాక్టర్! హై ఐక్యూ, హై క్రియేటివిటీ ఉన్న ఎంబ్రియోలు రెంటినీ గర్భంలోకి ప్రవేశపెడితే?” అన్నాడు అభిరాం.
“రెండు పిండాలూ పూర్తిగా పెరిగి కవలలుగా తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. అదీకాక, కవలల గర్భధారణలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఒకటే పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టగలం” అంది డాక్టర్ ప్రతిభ.
“డాక్టర్! ఆలోచించుకుని చెప్పవచ్చా?” అన్నాడు అభిరాం.
“తప్పకుండా” అంది డాక్టర్.
ధాత్రి ఇబ్బందిపడుతూనే..
“డాక్టర్! ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండీ.. ఎంతోమంది ఎంబ్రియోలు మీ దగ్గర స్టోర్ చేస్తారు కదా! అవి కలిసిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మీ దగ్గర ఉన్న ఎంబ్రియో స్టోరేజీ ఫెసిలిటీ చూడొచ్చా?” అంది. డాక్టర్ ప్రతిభ నవ్వుతూ..
“తప్పకుండా చూడొచ్చు. అటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. క్రయో ఏప్రాన్, క్రయో గ్లౌవ్స్ వేసుకుని మీలో ఒకరు నాతో వస్తే క్రయోస్టోరేజీ రూమ్ చూపిస్తాను” అంది.‘నువ్వే వెళ్లు’ అన్నట్లుగా అభిరాం భార్య వంక చూశాడు. క్రయోస్టోరేజీ రూమ్‌లోకి అడుగు పెట్టగానే, బీప్ శబ్దం రావడంతో డాక్టర్ ప్రతిభ తన మొబైల్ స్క్రీనుపై కనిపించిన మెసేజ్ చూసుకుంది.
“సారీ ధాత్రీ! ఏదో ఎమర్జన్సీ కేస్. నేను అర్జెంట్‌గా ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లాలి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్లి నా అసిస్టెంట్‌ను పంపుతాను” అంటూ బయటికి నడిచింది.
ఒక్కదాన్నే ఉన్నానన్న భయంతో ధాత్రి శరీరంలో వణుకు ఎక్కువైంది. క్రయోస్టోరేజ్ గదిలో చలి ఎముకలకు తాకింది. లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు నిశ్శబ్ద శవపేటికల్లా భయపెడుతున్నాయి. వీటిలో ఏ ట్యాంకులో తన ఎంబ్రియోలున్నాయా!? అనే ఆలోచనలో పడింది. ‘అమ్మా… అమ్మా…’ అంటూ అనేకమంది చిన్నారుల గొంతులు ఒక్కసారిగా వినిపించాయి. ‘అమ్మా.. నీ పిల్లలమే మాట్లాడుతున్నాం. చలికి గడ్డకట్టుకుపోతున్నాం. మమ్మల్నీ ఐస్ పెట్టెలనుంచి రక్షించి, నీ వెచ్చని ఒడిలో దాచుకోమ్మా!’ అంటూ ప్రాధేయపడ్డాయి.
మాతృత్వ భావోద్వేగంతో ఆమె తనువూ మనసూ పులకించిపోయాయి. ధాత్రి ఆ గొంతులు వినిపిస్తున్న ట్యాంక్ దగ్గరికెళ్లి దానిపైనున్న డోర్ తెరిచింది. ఆ ట్యాంక్‌లో అనేక ర్యాక్‌లు ఉన్నా.. అందులోని ఒక ర్యాక్ నుంచే ఆ గొంతులన్నీ విపిస్తున్నాయి. ఆ ర్యాక్‌ని నెమ్మదిగా బయటికి తీసింది. దానిపైన తన ఐడీ నెంబర్ స్పష్టంగా కనిపించింది. తన పమిటకొంగును పక్క ట్యాంక్‌పై పరిచి, క్రయోవయల్స్ను ఒక్కొక్కటిగా బయటకితీసి కొంగులో వేసుకుంది. ఆ వయల్స్ వంక ప్రేమగా చూసి, కొంగుకున్న రెండంచులను ఒక దగ్గరికి చేర్చి, చీర కుచ్చిళ్లలో దోపుకొంది. కడుపు ఎత్తుగా కనిపించడంతో గర్భం దాల్చిన అనుభూతి మొదటిసారి కలిగింది.
‘అమ్మా! నీ ఒడి ఎంత వెచ్చగా ఉందో!’ అంటూ ఆ పిండాలన్నీ సంతోషాన్ని వ్యక్తం చేశాయి.అంతలో హఠాత్తుగా ఓ గుడ్లగూబల గుంపు ఎగురుకుంటూ వచ్చి, ఆమె ఒడిలోనున్న వయల్స్లోని పిండాలను తమ పదునైన ముక్కులతో పొడిచి తినేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ధాత్రి ఒక చేతితో తన బలాన్నంతా ఉపయోగించి, వాటిని తరిమేయాలని చూస్తోంది. ఆమె గుర్తుపట్టింది.. ఆ గుడ్లగూబలన్నీ అభిరాం వర్క్డెస్క్ మీద ఉండేవే!
ఎంబ్రియోలన్నీ హాహాకారాలు చేస్తుంటే, ధాత్రి ‘ఉష్… ఉష్…’ అంటూ వాటిని తరిమేసింది. గుడ్లగూబలు బయటికి పోగానే నెమళ్లు గుంపుగా ప్రవేశించి నాట్యం చేయడం ప్రారంభించేయి. పిండాలన్నీ సంతోషంతో ఆమె కడుపు దగ్గరగా జరిగేయి. మళ్లీ ఆ గుడ్లగూబల గుంపు ఎక్కడ తిరిగి వస్తుందో అన్న భయంతో ధాత్రి ‘ఉష్… ఉష్…’ అంటూ అరుస్తూనే ఉంది.
“ధాత్రీ! ఏమైందీ? కలొచ్చిందా?” అంటూ అభిరాం ఆమె భుజాలను పట్టుకుని కుదపడంతో ఆమెకు మెలకువ వచ్చింది. ఇదంతా కల అని తెలిసి కాస్త ఊరట కలిగినా, గుండె దడ మాత్రం తగ్గలేదు.
“ధాత్రీ! ఏఐ స్క్రీనింగ్ గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు. తప్పనిసరి పరిస్థితులలోనే మనం ‘ఆర్ట్’కి వెళ్లాం కదా…”
“ఆర్ట్ ఆ..!? ఇందులో ఆర్ట్ ఏముందీ? అంతా కృత్రిమమే కదా!”
“ఆర్ట్ అంటే ఆ ఆర్ట్ కాదు. ఏఆర్టీ.. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్. వాటిలో ఐవీఎఫ్.. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ ఒకటి. ధాత్రీ.. మనం ఎంత గొప్పకాలంలో జీవిస్తున్నామో చూడూ! మనకు నచ్చిన ‘అండ-పిండ-బ్రహ్మాండా’లను ఎంపిక చేసుకోవచ్చు…”అభిరాం మాటలకు అడ్డుతగులుతూ..
“ఎంపిక సరే! అది ఎవరి చేతిలో ఉందన్నది ముఖ్యం” అంది.
“ధాత్రీ! రాబోయే తరం కృత్రిమ మేధతో పోటీ పడాల్సివస్తుంది. అందుకే కదా ఏభైవేల డాలర్లు ఖర్చు చేయడానికి కూడా మనం వెనుకాడలేదు. చాలా స్మార్ట్ పిల్లలైతేనే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలరు. నాకు తెలిసిన ముగ్గురు సీఈవోలు కూడా హై ఐక్యూ ఎంబ్రియోల కోసం స్కానింగ్‌కి వెళ్లారు. ఆ అవకాశాన్ని మనం మాత్రం ఎందుకు వదులుకోవాలి? మారిన పరిస్థితులకు అనుకూలమైన లక్షణాలు కలిగిన జీవులే కొనసాగుతాయని కదా డార్విన్ అన్నాడు”
“డార్విన్ చెప్పింది పరిణామక్రమంలో సహజ ఎంపిక గురించి. కానీ మనం చేస్తున్నది అసహజ ఎంపిక కదా!.. నాకిదంతా గందరగోళంగా ఉంది అభీ!”
“ధాత్రీ! మనకు పుట్టబోయే కొడుకు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాకపోయినా, శ్రీనివాస రామానుజనైనా కావాలి కదా!” అన్నాడు.
“వాళ్లెవరూ ఎంబ్రియో స్క్రీనింగ్, స్కానింగ్ వల్ల మేధావులు కాలేదు! నువ్వు చెప్పిన మేధావుల లిస్ట్‌లో మేరీ క్యూరీ లేదు. మన ఎంబ్రియోలకి చేస్తున్న ఈ స్క్రీనింగంతా మేధావైన మగపిల్లాడి కోసమేనా?!” అంది ధాత్రి.
“తెలివి తేటలంటూ ఉంటే అమ్మాయైనా, అబ్బాయైనా ఒకటే” అన్నాడు అభిరాం తెలివిగా.
“అభీ! ద్రౌపదికి సంబంధించిన కథ వినే ఉంటావు. ఆమె గొప్పవాడు, బలవంతుడు, విలువిద్యలో నైపుణ్యం కలిగినవాడు, అందమైనవాడు, తెలివైనవాడు అయిన భర్త కోసం శివుణ్ని ప్రార్థిస్తుంది. శివుడు ఆమెకు ఒక వరం ప్రసాదిస్తాడు: ఏ పురుషుడు కూడా ఈ ఐదు లక్షణాలను కలిగి ఉండడం అసాధ్యం కాబట్టి, ఆమెకు ఐదుగురు భర్తలు ఉంటారని. ప్రతి ఒక్కరూ ఈ లక్షణాలలో ఒకదాన్ని కలిగి ఉంటారని అంటాడు.. మనం కూడా అలానే ఓ అసాధ్యమైనదాన్ని కోరుకుంటున్నాం అనిపిస్తోంది”ఆమె చెప్పినదాంట్లో వాస్తవం ఉందనిపించడంతో అభిరాం మౌనంగా ఉండిపోయాడు.
“చివరగా నాకో సంగతి చెప్పు అభీ… వంద పిండాల నుంచి ఏఐ స్కాన్ చేసి ఎంపిక చేసిన పిండాలలో ఒకటో రెండో నా గర్భంలో ఇంప్లాంట్ చేసేకా.. తక్కిన పిండాలన్నీ ఏమవుతాయ్?”
“ఫ్రీజర్‌లో స్టోర్ చేస్తారు”
“ఎంత కాలం?”
“మనిష్టం. మనం స్టోరేజ్ చార్జీలు చెల్లించినంత కాలం”
“ఆ తర్వాత?”
“అవసరం ఉన్న దంపతులు ఎవరికైనా దానం చేయచ్చు. పరిశోధనా సంస్థలకి ఇవ్వొచ్చూ, లేదంటే డిస్కార్డ్ చేస్తారు”
“డిస్కార్డ్.. అంటే చంపేయడమే కదా! ఇప్పటికి అలా ఎన్ని వేల ఎంబ్రియోలను చంపేశారో! ఈ సంతాన సాఫల్య కేంద్రాలన్నీ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణులే!”
“అది చంపడం ఎలా అవుతుంది? లిక్విడ్ నైట్రోజన్‌లో -196 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఫ్రీజ్ చేసినప్పుడు.. వాటిలో జీవక్రియ నిలిచిపోతుంది. వాటిని ప్రాణం ఉన్నవాటిగా భావించకూడదు”
“అభీ! నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నా కానీ, ఇందులో అమానుషమైనదేదో ఉందనిపిస్తోంది. నిజమే.. రాబోయే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోడానికి చాలా తెలివితేటలు అవసరం పడతాయి. నువ్వన్నట్లే కానిద్దాం! కాకపోతే ఏ ఎంబ్రియోని ఎంచుకోవాలనేది మనిద్దరం తేల్చుకోలేకపోతున్నాం కాబట్టి, నిష్పక్షపాతంగా ఆలోచించగలిగే వాళ్లెవరినైనా సలహా అడుగుదామా?”
“అడుగుదాం. కానీ, ఒక్కరినే అడుగుదాం. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. ఎవరి ఒపీనియన్ తీసుకుందాం?”
“మన ఇద్దరి కుటుంబ సభ్యులలో మా అమ్మకి స్థితప్రజ్ఞత ఎక్కువ. తనని అడిగితే నీకు ఓకేనా?”
ధాత్రి తల్లి వసుంధర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేసి, ఆరు సంవత్సరాల క్రితం విరమణ చేసింది. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అనేకసార్లు అవార్డులు అందుకుంది. ఆమె విజ్ఞతపై అక్కడి గ్రామస్తులకే కాదు.. కూతురుకీ-అల్లుడికీ కూడా మంచి నమ్మకం.
“డన్! ఇప్పుడే ఫోన్ చేయి” అన్నాడు అభిరాం.ధాత్రి వాళ్లమ్మకు ఫోన్ చేసి, విషయమంతా క్లుప్తంగా చెప్పి..
“అమ్మా! స్పీకర్ ఆన్ చేశా, నీ అభిప్రాయం వివరంగా చెప్పు” అంది. వసుంధర అడిగితే తప్ప ఎవరికీ సలహా ఇవ్వదు. ఇది చాలా సున్నితమైన సమస్య కాబట్టి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పాలనుకుంది.
“పిల్లలు ఎటువంటి లక్షణాలతో పుట్టాలనేది.. తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువులు నిర్ణయించాలి కానీ, బయటి వ్యక్తులూ, కృత్రిమ మేధ నిర్ణయించడం ఎంత వరకు సబబు? ప్రకృతి విరుద్ధంగా జన్యువులను తార్చి డిజైనర్ బేబీలను సృష్టిస్తే.. వాళ్లు యంత్ర సంతతి అవుతారు. పరిశ్రమలలో తయారయ్యే సరుకులు అవుతారు! ఇదెంత పెద్ద నైతిక సమస్యో మీకు అర్థం కావడం లేదా? ప్రయోగశాలలో ఏమైనా పొరపాట్లు జరిగి, పిల్లలు సమస్యలతో పుడితే దానికి జవాబుదారీ ఎవరు? ఏది ‘తెలివి’? తెలివిని ఒక సంఖ్యలో కుదించగలమా? తెలివి తేటలకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనం కానీ, కొలమానం కానీ ఉందా?
సహజత్వానికి భిన్నంగా పంటల్లో జరుగుతున్న జన్యుమార్పిడిని వ్యతిరేకిస్తూ ఊళ్లలో రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు మీ వరకూ రాలేదా? విత్తనాలు కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్తాయనీ, ప్రజల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకున్నపాటి చైతన్యం కూడా మీకు లేదా? మీ పిల్లల భవిష్యత్తును కార్పొరేట్ ఆసుపత్రుల చేతుల్లో పెడుతున్నామన్న స్పృహ ఉందా?…”
ఇంతకీ తన మాటలు కూతురూ-అల్లుడూ వింటున్నారా? లేదా? అని అనుమానంతో ఆగింది. అభిరాం అదే అదనుగా తీసుకుని.. “అత్తయ్య గారూ! మీరు టీచర్‌గా రిటైరయ్యి ఆరేళ్లు దాటినా ‘క్లాసులు’ తీసుకోవడం మానలేదా! ఇదంతా వినే టైం మాకు లేదు. అధిక మేధస్సు బేబీనా, అధిక సృజనాత్మక బేబీనా? మీ అభిప్రాయం ఏమిటో ఒక్క ముక్కలో చెప్పేయండి” అన్నాడు. ఎంత నింపాదిగా మాట్లాడినా అతని గొంతులో అసహనం తెలిసిపోతోంది.
“రెండూ కాదు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరమైన బిడ్డను ఎన్నుకోవడమే వివేకం” అంది వసుంధర.
“అమ్మా! కృత్రిమ మేధస్సు విశ్లేషణ ప్రకారం…”
“ఆపవే నీ కృత్రిమ మేధస్సు గోల! కృత్రిమ మేధస్సును సృష్టించింది కూడా మానవ మేధస్సే కదా! దానిని వాడరా మీరూ? ఆరోగ్యం ఉంటే తక్కినవన్నీ ప్రయత్నించి సాధించుకోవచ్చు. మిగిలిన పిండాలను ఏ పరిశోధనా సంస్థకో దానం చేస్తే.. అవన్నీ చిరంజీవుల్లా వందల సంవత్సరాలు జీవించే ఉంటాయి” భార్యాభర్తలిద్దరికీ ఆ మాటలు చద్ది మూటల్లా, చీకట్లో వెలిగించిన దీపాల్లా తోచాయి. సంతోషంగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.
“థాంక్స్ అమ్మా!” అని ధాత్రి ఫోన్ కట్ చేసింది.
“బహుశా.. మనం చాలా ముందుకెళ్లి పోయామేమో!” అని నిట్టూర్చాడు అభిరాం.
“అభీ! నువ్వేమంటావ్?”
“నేను ముందే చెప్పాగా! సెకండ్ ఒపీనియన్ ఈజ్ ఫైనల్ అనీ. లెటజ్ గో ఎహెడ్!” అన్నాడు.
ధాత్రి అద్దంలో చూసుకుంది. తన ప్రతిబింబంపై మసక తెర తొలగినట్లు అనిపించింది. తన మనోవల్మీకం నుంచి నెమళ్లు నెమ్మదిగా బయటికి వచ్చాయి. వాటి పదునైన ముక్కులతో తాళ్లను బలంగా కొరికేసి, ఆమెకు బంధవిముక్తి కలిగించాయి.
– యాళ్ల అచ్యుత రామయ్య