హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : అర్హులైన చేనేత కార్మికులందరికీ చేయూత పింఛన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కఠిన నిబంధనలతో నిజమైన చేనేత కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని, వృద్ధాప్యంలో వారికి అందాల్సిన ఆసరా దక్కకుండా పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు పొందిన కార్మికులనే లబ్ధిదారులుగా పరిగణిస్తుండటం సరికాదని పేర్కొన్నారు.
గతంలో ఉపాధి అవకాశాలు లేక ముంబై, షోలాపూర్, భీవండి, సూరత్, పుణె తదితర ప్రాంతాలకు వలస వెళ్లి, ప్రస్తుతం స్వరాష్ర్టానికి తిరిగివచ్చిన అనేకమంది కార్మికులు పింఛన్ అందక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వారిని గుర్తించి వెంటనే పెన్షన్ ఇవ్వాలని కోరారు. చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండి, 50 ఏండ్లు పైబడిన కార్మికులకు జియోట్యాగ్ లేకపోయినా, వారి వృత్తి అనుభవం, సహకార సంఘాల రికార్డులను ప్రామాణికంగా తీసుకుని పింఛన్ వర్తింపజేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ విజ్ఞప్తి చేశారు.