సోనీ లివ్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: కుంచాకో బోబన్, లిజోమోల్ జోస్, కృష్ణ ప్రభ, విశాక్ నాయర్, సిద్ధిఖీ, సుధీష్ తదితరులు
దర్శకత్వం: కిరణ్ దాస్
బలమైన కథలు, ఊహించని మలుపులతో మలయాళం క్రైమ్ థ్రిల్లర్లు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. సహజమైన నటనతోపాటు వాస్తవికతకు దగ్గరగా ఉండే స్క్రీన్‌ప్లేలు కూడా ఈ సినిమాలను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఈ క్రమంలో కేరళంలో సంచలన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ఉన్మాదం’.. ఇటీవలే ‘సోనీ లివ్’ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. తెలుగు వెర్షన్లోనూ విడుదలై.. ఇక్కడి ఆడియెన్స్‌నూ ఆకట్టుకుంటున్నది. ‘సినిమా కథ’లోకి వెళ్తే.. సినిమా పరిశ్రమలోకి వెళ్లాలనేది షెల్లీ (కుంచాకో బోబన్) జీవితాశయం.
ఎప్పటికైనా మంచి రైటర్ కావాలని కలలు కంటాడు. అయితే, కుటుంబ పరిస్థితుల కారణంగా కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరతాడు. అతని భార్య సౌమ్య (లిజోమోల్ జోస్). ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంటుంది. అయితే, షెల్లీ పోలీస్ ఉద్యోగంలో చేరినా.. సినిమా రైటర్ కావాలన్న తన కలను మాత్రం వదులుకోడు. పగలంతా స్టేషన్లో డ్యూటీ చేసి, సాయంత్రం ఇంటికి వచ్చాక సినిమా కథలపై పడతాడు. కనిపించిన ప్రతిదానిలోనూ ఓ కథను వెతుకుతాడు.
అలా ఎన్ని కథలు రాసినా.. అవి నిర్మాతలను మెప్పించవు. సినిమాలుగా పట్టాలెక్కవు. దీంతో తీవ్రమైన నిరాశకు లోనవుతాడు షెల్లీ. అయినా, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ఓ అసైన్మెంట్ ఫెయిల్ అవ్వడంతో వేరే స్టేషన్‌కు బదిలీ అవుతాడు. అక్కడ ఆరేండ్ల క్రితం చనిపోయిన ఓ యువతి కేసు గురించి షెల్లీకి తెలుస్తుంది. అయితే, ఆ కేసు వెనకాల ఏదో శక్తి ఉందని ఆ స్టేషన్లో అందరూ అనుకుంటారు.
అందుకు తగ్గట్టే.. ఆ కేసు ఫైల్‌ను ఎవరు ఓపెన్ చేసినా వాళ్లు రక్తం కళ్ల జూస్తారు. దాంతో, దాన్ని ఓ శాపగ్రస్త కేసుగా భావించి.. ఆ ఫైల్‌ను ఎవరూ టచ్ కూడా చేయరు. కానీ, షెల్లీ మాత్రం అందులోనూ ఓ సినిమా కథను వెతుకుతాడు. వెంటనే ఆ కేసు దర్యాప్తును ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఆ ఫైల్‌ను తిరగేయడం మొదలుపెట్టిన షెల్లీ మానసిక స్థితికి ఎలా మారిపోతుంది? అసలు ఆ కేస్ ఫైల్ ఏంటి? ఆ యువతి ఎలా చనిపోయింది? దీని వెనుక ఉన్నది ఎవరు? చివరికి షెల్లీ అనుకున్నది సాధించాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!