చం॥ వలసిన కూలికిన్ కుదర వచ్చును నీవెటనైన, నేను కై
కిలినొనరింతు నక్కడనె నాగలి బట్టి దుక్కి చా
ళులు బడ దున్నుచుండ నొడిలోపలి గింజలు తీసి తీసి చా
ళుల వెదజల్ల నీ యడుగులో నడుగుంచుచు వత్తు నీడనై
ఈ పద్యం డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గంగిరెద్దు అనే పద్యకావ్యం లోనిది. పూర్వ వరంగల్ జిల్లా నివాసి అయిన దుర్గయ్య గారు 1940లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు తరగతులు ప్రారంభించినప్పుడు తొలి విద్యార్థి. తరగతిలో ఒకే ఒక విద్యార్థి కూడా! రాయప్రోలు సుబ్బారావు, ఖండవల్లి లక్ష్మీ రంజనం, గంటి శివ రామయ్య ఈ ముగ్గురు అధ్యాపకులు. తర్వాతి కాలంలో దుర్గయ్యగారు ఓయూలో తెలుగు విభాగ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రాచీన పద్య సాహిత్యం క్షుణ్నంగా అధ్యయనం చేసిన ఈయన విశేష పద్యకవి.
వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న ఒక పేద రైతు కుటుంబ గాథ ఇది. ఒక రోజు అతని ఇంట్లో ఒక ఆవు అంగ వికలత్వంతో అందవిహీనంగా కనిపించే ఒకమగ దూడకు జన్మనిచ్చింది. అయ్యో ఈ దూడ వ్యవసాయానికి పనికిరాదే అని రైతు కుమిలిపోతున్న సందర్భంలో భార్య ఓదార్పుగా పలికిన పద్యమిది. కైకిలి అనేది అచ్చ తెలంగాణ పల్లె పదం. కూలికి పోవడం అని అర్థం. ‘అవసరమైతే నువ్వు కూలికి వెళ్లవచ్చు. నేను కూడా అక్కడే కైకిలి చేస్తాను. నువ్వు నాగలి దున్నుతుంటే నేను ఒడిలో కట్టుకున్న (విత్తనాలు) గింజలు దీసి ఆ చాళుల్లో వరుసగా విత్తుతూ ఉంటాను. నీ అడుగులో అడుగు వేస్తూ నీడలా నిన్ను అనుసరి స్తాను.
ఇలా పని చేయడం ద్వారా మన బతుకు బండి నడుస్తుంది. భయపడవద్దు’ అని భార్య రైతుకు ధైర్యం చెబుతుంది. నిజమైన దాంపత్య జీవన సౌందర్యం ఇందులో కనబడుతుంది. ‘నీ అడుగులో అడుగు వేయడం’ అనడం వివాహ తంతులోని సప్తపదిని గుర్తుకు తెస్తుంది. దున్నినపుడు నాగేటిసాళ్లు చక్కగా గీత గీసినట్లుగా వస్తాయి. ఇది ప్రతీకాత్మకంగా మన జీవనం ఇబ్బంది లేకుండా చక్కగా సాగుతుంది అని చెప్పడం. అలాగే ఒడిలోపలి గింజలు తీయడం అనేది సంతానానికి ప్రతీక కాగా, సాళ్లల్లో వెదజల్లడం అనేది సమాజ శ్రేయస్సు కోసమే మన సంతానం ఉపయోగపడుతుంది అని చెప్పడం. వ్యవసాయానికి ప్రతీకగా అల్లిన ఈ పద్యం.. శ్లేషగా వైవాహిక జీవితాన్ని చూపిస్తూ భారతీయ కుటుంబ జీవన ఆదర్శాన్ని
ప్రకటిస్తుంది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ