ఓటీటీలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గుడ్డూ భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో పాటు గోలు గుప్తాగా శ్వేతా త్రిపాఠి నటన తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నది. ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ మీర్జాపూర్ సినిమాగా వెండితెర ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇందులో నటించిన శ్వేతా త్రిపాఠి మీడియా వేదికగా డిజిటల్ యుగంలో నటీనటులు ఎదురొంటున్న సవాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నది.
సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలపై డిజిటల్ మీడియా విపరీతంగా ఫోకస్ చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. సెలెబ్రిటీలు మాట్లాడిన చిన్న మాటను సందర్భం లేకుండా కట్ చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మీర్జాపూర్లో గోలు గుప్తా పాత్ర ఎంత ధైర్యంగా, నిజాయితీగా ఉంటుందో.. నిజ జీవితంలోనూ నేను అలాగే ఉండాలని అనుకుంటున్నా. ఎవరు ఏమనుకున్నా సరే, గౌరవప్రదంగా నా అభిప్రాయాన్ని నిజాయితీగా చెబుతా’ అని ఆమె స్పష్టం చేసింది.
నటులను సంక్లిష్టమైన రాజకీయ ప్రశ్నలు అడిగి హెడ్‌లైన్స్ కోసం వాడుకోవడం సరికాదంటున్నది శ్వేత. ‘ప్రభుత్వ నిర్ణయాలు, అధికారిక పత్రాల గురించి మాకు పూర్తి అవగాహన ఉండదు. ప్రశ్నలు అడిగారు కదా అని పొరపాటున ఏమైనా మాట్లాడామా.. మమ్మల్ని మామూలుగా ట్రోల్ చేయరు’ అంటూ చెప్పుకొచ్చింది. నటన, సినిమాల గురించి మాత్రమే తమను ప్రశ్నించాలని, సమాజంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం నేర్చుకోవాలని కోరింది.