 
                                                            కోహెడ, అక్టోబర్ 30: మొంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరి, మొక్కజొన్న,పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ్లను కాపాడుకోడానికి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కోహెడ నుంచి కరీంనగర్ వెళ్లే దారిలోని ఎల్లమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇందుర్తి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ-సిద్దిపేట దారిలో తంగల్లపల్లి గ్రామం వద్ద పిల్లి వాగులో వరద ఉధృతంగా పారుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ఇటు సిద్దిపేట జిల్లా కేంద్రానికి, అటు పాత జిల్లాకు వెళ్ల్లడానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. బస్వాపూర్ వాగు పొంగి ప్రవహిస్తున్నది. సింగరాయ ప్రాజెక్టు, శనిగరం ప్రాజెక్టు పెద్ద ఎత్తున అలుగు పోస్తున్నాయి. పత్తిచేన్లలో నీళ్లు చేరడంతో భారీగా పంటనష్టం జరిగింది. పోరెడ్డిపల్లికి చెందిన ఓ రైతు 10 ట్రిప్పుల వడ్లు వాగు పాలయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హైమావతి గురువారం పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలు, వరద ఉధృతిని పరిశీలించారు. మోయతుమ్మెద వాగును, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు.
కేంద్ర ప్రభుత్వం సహకరించి వరద నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. విపత్తుల సమయంలో కేంద్రం , రాష్ట్రం అనే భేదం లేకుండా బాధితులను ఆదుకోవడం ముఖ్యమని అన్నా రు. బాధితులకు సహాయం అందించేందుకు తనవంతుగా కృషిచేస్తానని ఆయన అన్నారు. పంటనష్టం వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో సముద్రాల వద్ద ఆర్టీసీ బస్సు టైర్ పంచర్ కావటంతో ప్రయాణికులు దిగి ఉండడం చూసి తన వాహనం ఆపి ప్రయాణికులతో మంత్రి పొన్నం మాట్లాడారు.
 
                            