దుబ్బాక, జూన్ 24: కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు. దీంతో కార్పెంటర్ పని కొనసాగడం లేదు. ప్రస్తుతం మా కులవృత్తి వడ్రంగి పని కరెంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. కోతల కరెంట్‌తో పని చేసేందుకు పలు ఇబ్బందులు పడుతున్నాం. ఒప్పుకున్న పని సకాలంలో చేసి ఇవ్వలేకపోతున్నాం. ఎప్పుడు కరెంట్ పోతుందో…ఎప్పుడు వస్తుందో తెలువని పరిస్థితి నెలకొంది. ఓ పక్క వర్షాలు లేక మరో పక్క కోతల కరెంట్‌తో సమస్యగా మారింది. కేసీఆర్ సర్కారులో గ్రామాల్లో నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగింది. అన్ని వర్గాలూ సంతోషంగా పనులు చేసుకున్నారు.
నాగల్గిద్ద, జూన్ 24: కరెంట్ కష్టాలు తీర్చి రైతులకు ఎంతో మేలు చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 3 గంటల కరెంటు కూడా వచ్చేది కాదు.ఉండేది. మళ్లీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2014 ముందు పరిస్థితులు మొదలయ్యాయి. కేసీఆర్ సీఎం అయ్యాక 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చి రైతుల బాధలను దూరం చేశారు. సీమాంధ్ర పాలనలో రాత్రి వేళల్లో బోర్ల వద్ద పడుకొని పాముకాటుకు ఎంతోమంది రైతులు చనిపోయారు. రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసేటోళ్లం. కేసీఆర్ సీఎం అయ్యాక కంటి నిండా నిద్రపోయాం. కరెంటు విషయంలో కేసీఆర్‌ను నిలదీయడం సరికాదు.కాంగ్రెసోళ్లు మంచిగా కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
చిలిపిచెడ్, జూన్ 24: ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ ఇబ్బందులు ఎలా ఉండేవో.. అలాంటి పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తీసుకొచ్చింది. పదేండ్లు కేసీఆర్‌కు సాధ్యమైంది..కాంగ్రెసోళ్లకు ఎందుకు సాధ్యం కావడం లేదు. నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెసోళ్ల మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామని వట్టి మాటలు చెబుతున్నారు. రాత్రి వేళల్లో గంటల తరబడి కరెంటు లేక ఇబ్బంది పడుతున్నాం. చిన్నపాటి వర్షం కురిసిన, గాలి వీచినా కరెంటు కట్ చేస్తున్నారు. పగలు ఎండ, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. వర్షం సాకుతో గంటల తరబడి కరెంటు తీసేస్తున్నారు. కేసీఆర్ హయాంలో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఉండేది. ఛత్తీస్గడ్ నుంచి కరెంటు తీసుకురావంపై కాంగ్రెసోళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. అప్పటి పరిస్థితుల్లో రైతులను రక్షించుకోవడానికి, పరిశ్రమలను కాపాడుకోవడానికి కరెంటు కొన్నారు. లేకపోతే ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి ఇబ్బందులు వచ్చేవి.
గుమ్మడిదల, జూన్ 24: గతంలో కంపెనీల్లో వారంలో రెండు రోజులు, నెలకు పది రోజులు పవర్‌హాలిడేలు ఇచ్చారు. దీంతో జీతం తక్కువ రావడం వల్ల కుటుంబాన్ని పోషించడానికి కార్మికులం ఇబ్బందులు పడ్డాం. ఈ బాధలు చూసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక కంపెనీలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చి కార్మిక లోకాన్ని కాపాడిండు. కంపెనీలు పవర్ హాలిడేలకు స్వస్తి చెప్పి ఉత్పత్తి మీద దృష్టి సారించాయి. రాష్ట్రంలో చాలా పరిశ్రలు రావడంతో లక్షల మంది కార్మికులకు ఉపాధి దొరికింది. కేసీఆర్ పదేంండ్ల పాలనలో బాగానే ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు రావడంతోనే కంపెనీల్లో ఎప్పుడు కరెంట్ పోతదో తెలుస్తలేదు. కంపెనీలో జనరేటర్‌తో నడిపించడానికి ఆసక్తి చూపుతలేరు. ఇట్లా కొన్ని రోజులు వస్తే తిరిగి కార్మికులు రోడ్డున పడే దుస్థితి వస్తుంది. ఇట్లా కాకుండా రాష్ట్ర సర్కారు పరిశ్రమలకు కటింగ్లేని కరెంట్ సరఫరా చేయాలి. లేదంటే కార్మికులకు కష్టాలు తప్పవు.