మెదక్, జూలై 17 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజ న్ ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా భారీ వర్షాలు పడక రైతులకు సాగునీటి గోస తప్పడం లేదు. మెదక్ జిల్లాలో ఈ సీజన్లో మోస్తరు వర్షాలే తప్పా భారీ వర్షాలు కురవలేదు. అంతేకాదు చెరువులు, వాగులు, ప్రాజెక్టులు పొంగలేవు. ప్రధాన చెరువుల్లో నీటి మట్టా లు కనిష్టానికి పడిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ వర్షాలు పడితే తప్పా చెరువులు, ప్రాజెక్టులు నిండే పరిస్థితే లేదు. గత సంవత్సరం ఈ సమయానికి చాలా చెరువుల్లో నీటి మట్టం పెరిగింది.
ప్రాజెక్టులు, వాగులు పొంగిపొర్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో రైతులు వరి నాట్లు వేసేందుకు ముం దుకు రావడం లేదు. జూలై రెండో వారం ముగియడంతో బోర్లను నమ్ముకొని పంట లు సాగు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బోర్లు లేని చోట నారుమళ్లను రక్షించుకోవడానికి రైతులు బిందెలతో నీరు తెచ్చి పోస్తున్నారు. నారుమళ్లు ముదిరిపోతున్నా వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు వేయడానికి రైతులు సాహసించడం లేదు. భారీ వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
మెదక్ జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 3.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు లక్ష ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వానకాలం సీజన్ ప్రారంభమై నెల దాటినా సాగు ముందుకు కదలడం లేదు. బోర్లు ఉన్న వారు ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. జిల్లాలో 3.27 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేయగా, ఇప్పటి వరకు 45వేల ఎకరాల్లో మాత్రమే రైతులు వరి సాగు చేశారు. అత్యధికంగా పత్తిసాగు 37వేల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, 32 వేల ఎకరాల్లో సాగు చేశారు. 1000 ఎకరాల్లో మొకజొన్న, 500 ఎకరాల్లో కందులు, 600 ఎకరాల్లో మినుములు, పెసర్లు, 200 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేశారు.
మెదక్ జిల్లాలో ఘనపూర్ ప్రాజెక్టు, రాయిన్పల్లి ప్రాజెక్టులు, చెరువులు, వాగులు ఉన్నాయి. భారీ వర్షాలు పడక ఘనపూర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న భూముల్లో వరి సాగు చేయలేదు. సుమారు 22వేల ఎకరాల్లో ప్రాజెక్టు కింద రైతులు పం టలు సాగు చేస్తారు. ప్రతి ఏడాది వానకాలంతో పాటు, రబీ సీజన్లో ఘనపూర్ ప్రాజెక్టు కింద రైతులు వరి నాట్లు వేసేవారు.
ఈ వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో వరి నాట్లు వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజీరానదిపై కొల్చారం-పాపన్నపేట మండలాల మధ్య ఏడుపాయ ల ప్రాంతంలో 1905లో ఘనపూర్ మధ్య తరహా ప్రాజెక్టు నిర్మించారు. ఆనకట్ట పొడవు 2.337 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు.
దీని పరిధిలో రెండు కాల్వలు (మహబూబ్నహర్, ఫత్తేనహర్) ఉండగా ఆయకట్టు విస్తీర్ణం 21,625 ఎకరాలు, మహబూబ్నహర్(ఎంఎన్) కెనాల్ పొడవు 42.80 కిలోమీటర్లు కాగా, దీని ద్వారా కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 11,425 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఫతేనహర్(ఎఫ్ఎన్) కెనాల్ పొడవు 12.80 కి.మీ కాగా, పాపన్నపేట మండలంలోని 11 గ్రామాల్లో 10,200 ఎకరాలకు సాగునీరు అందుతోంది. గత పదేళ్లలో ఘనపూర్ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాల్లో వరి పంటలు సాగు చేసుకున్న రైతులు వానకాలంలో వరినాట్ల కోసం అరిగోస పడుతున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఏనా డు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.