సిద్దిపేట, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తేలికపాటి వర్షాలు తప్ప గట్టి వానలు కురవలేదు. దీంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు జలాలు లేక వెళవెళపోతున్నాయి. మరోవైపు అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీరు అడుగంటి డెడ్‌స్టోరేజీకి చేరాయి. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటాయి. ఈ పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులు తేల్చుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వాయర్లు నింపి రైతులకు నీరిచ్చేందుకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనిశ్చితి వాతావరణం నెలకొంది. సాగునీరు సరిగా లేక వానకాలం సాగు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం వరినాట్లు 50శాతం కూడా వరినాట్లు పూర్తి కాలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నపూర్ణ, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో నింపి వాటి ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లకు నీటిని విడుదల చేయడంతో నిండుకుండలా ఉండేవి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రల్లో భాగంగా రిజర్వాయర్లలోకి నీటిని విడుదల చేయకపోవడంతో అవి నేడు డెడ్‌స్టోరేజీకి చేరాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావుల్లో నీటి నిల్వలు పడిపోయాయి. రైతులు సాగు చేద్దామంటే నీరు లేదు. పోసిన వరి నారు ముదిరిపోతున్నది. దీంతో ఏం చేయా లో తెలియని పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్లను నింపాలని రైతులు డిమాండ్ చేస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
రిజర్వాయర్లు నింపి కాలువల ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శనివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు. సాగునీటికి రైతులు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. గతేడాది ఇదే ఆగ స్టు నెలలో అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీలు నీళ్లు ఉంటే, ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయకసాగర్‌లో 2.38 టీఎంసీలకు ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్నసాగర్ 18 టీఎంసీలకు ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలకు ప్రస్తుతం 4.5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నట్లు లేఖ లో పేర్కొన్నారు.
ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతు లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతు లు ఆవేదన చెందుతున్నారన్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని తెలిపారు. రాజకీయాలు పక్కనపెట్టి మిడ్ మానేరు అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పం పింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రిజర్వాయర్లు నింపి కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని రైతులపక్షాన మంత్రిని హరీశ్‌రావు లేఖలో కోరారు.
తూప్రాన్, ఆగస్టు 3: వెంకటరత్నాపూర్ హల్దీవాగు ఒడ్డున రెండు ఎకరాలు, పైకిమరోచోట ఎకరం కలిపి మొత్తం మూడు ఎకరాల పొలం ఉన్నది. మరోచోట ఉన్న ఎకరం పొలానికి హల్దీవాగు నుంచే పైప్‌లైన్ వేసుకున్నాం. బోరు ఉన్నప్పటికీ వానకాలం హల్దీవాగు ప్రవహిస్తేనే మూడు ఎకరాలు పుష్కలంగా పారుతాయి లేదంటే వర్షాలు బాగా పడాలి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఆశలేదు. హల్దీవాగులోకి కాళేశ్వరం నీళ్లు వదిలితే వాగునీరే ఆధారంగా సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయాలి.
– సీత కుమార్, వెంకట్త్న్రాపూర్, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా
తూప్రాన్, ఆగస్టు 3: మాకు తూప్రాన్ రామాలయం సమీపంలో ఎనిమిది ఎకరాల పొలం ఉన్నది. వర్షపు నీరు లేదా వాగు నీరే మాకు ఆధారం. కాలం కాక వానలు సరిగ్గా పడక ఇప్పుడిప్పుడే దున్నకాలు మొదలు పెట్టాం. వాగునీటిపైనే ఆశలు పెట్టుకున్నాం. హల్దీవాగులో నీళ్లు అడుగంటుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు సాగు కష్టమే. హల్దీవాగులోకి నీళ్లు వదిలితే మాతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తూప్రాన్ పెద్దచెరువు నిండుతది. పెద్ద చెరువు కింద ఆయకట్టు రైతులకు కూడా ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం హల్దీవాగులోకి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
– కమ్మరి రాజు, యువ రైతు, తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా
వెల్దుర్తి, ఆగస్టు 3: రెండు, మూడేండ్ల నుంచి కాళేశ్వరం నీళ్లు హల్దీవాగు ద్వారా పారడంతో పుష్కలంగా పంటలు పండాయి. యాసంగి పంటకు నీళ్ల ఎద్దడి అయ్యేనాటికి వాగులో నీళ్లు వచ్చేవి. యాసంగితో పాటు వానకాలం పంటలకు సాగునీళ్లు అందేవి. కాలం ఎటమటం అయినా నీళ్లకు ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ యేడు వాగులో నీళ్లు రాలేదు. వానలు సరిగ్గా పడక పోయినా నీళ్లు వదిలితే పంటలకు నీళ్ల సౌలత్ అయితది.
– కొమురయ్య, రైతు, కొప్పులపల్లి, వెల్దుర్తి మండలం,మెదక్ జిల్లా
వెల్దుర్తి, ఆగస్టు 3: గత ప్రభుత్వ హయాంలో మూడేండ్ల పాటు ఎండాకాలంలోనే నీళ్లు పారేది. యాసంగి పంటలకు నీటి ఇబ్బందులు వచ్చే సమయానికి కొండపోచమ్మసాగర్ నుంచి నీళ్లను హల్దీవాగులోకి వదిలేవారు. మండుటెండల్లో రెండు, మూడు నెలల పాటు నీళ్లు పారేది. యాసంగి పంటలకు నీటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకునేటోళ్లం. ఈ యేడు వాగులో నీళ్లు లేక యాసంగి పంటలకు ఇబ్బంది కావడంతోపాటు వానకాలం సాగుకు ఇబ్బంది పడాల్సి వస్తున్నది.
– మహేందర్‌రెడ్డి, రైతు, ఆరెగూడెం, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా
మిరుదొడ్డి, ఆగస్టు 3 : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నంత సేపు రైతులకు ఇబ్బంది లేకుండే. బోరు, బావుల్లో భూగర్భజలాలు పెరిగాయి. కానీ ఇప్పుడు మల్లన్నసాగర్లో నీళ్లులేక బోర్లు పోస్తలేవు.మాజీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగ ఉంటుండే.ఎక్కడ చూసినా నీళ్లే కనిపించేది. సగం వానకాలం అయినా మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి ప్రభుత్వం నీళ్లు విడుదల చేయడం లేదు. సాగు నీళ్ల కోసం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి మల్లన్నసాగర్‌లోని నీళ్లు తీసుకురావాలని కోరుతున్నా.
-కుమ్మరి చంద్రం, రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
వెల్దుర్తి, ఆగస్టు 3: మండుటెండల్లో వాగులో గోదావరి నీళ్లు పారితే రైతులకు ధీమా కలిగేది. పంటలకు ఎలాంటి నీళ్ల ఇబ్బంది లేదనే భరోసా వచ్చేది. సంతోషంగా పంటలు సాగు చేసేవాళ్లం. కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత మూడేండ్ల పాటు ఎండాకాలం పూర్తయ్యే వరకు వాగులో నీళ్లు పారేవి. ఎండాకాలం పంటలకు, తాగడానికి నీళ్ల ఇబ్బందులు ఉండేవి కావు. కానీ ఈ ఏడాది వాగులో నీళ్ల లేక ఇబ్బంది పడుతున్నాం. ఈసారి వరి నాటు వేద్దామంటే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు లేక బావుల్లో నీళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి.
– ఆంజనేయులు, రైతు, ఆరెగూడెం, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా
సిద్దిపేట, ఆగస్టు 3: కేసీఆర్ ప్రభుత్వ హయాంలోమల్లన్నసాగర్ నీటితో అంకంపేట చెరువును నింపారు. అప్పుడు బోరు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండేవి. మూడు ఎకరాల పొలం పారింది. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో పైపులు వేసి ఇంకో రెండు ఎకరాల పొలం పారించా. మొన్నటి వానలకు మూడు ఎకరాల పొలం నాటువేశా. బావిలో నీళ్లు రోజురోజుకు తగ్గుతున్నాయి. నాటువేసిన పొలం కూడా పారేటట్లు లేదు. ప్రభుత్వం మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలి అంకంపేట చెరువు నింపాలి.
-దుర్గం రాజేశ్, రైతు, బచ్చాయిపల్లి, సిద్దిపేట రూరల్ మండలం, సిద్దిపేట జిల్లా
సిద్దిపేట, ఆగస్టు 3: నాకు మూడున్నర ఎకరాల పొలం ఉన్నది. నీళ్లు లేక నాటు పెట్టలే. అంకంపేట చెరువులో నీళ్లు ఉంటే మా బోరు, బా వుల్లో పుషలంగా నీళ్లు ఉంటాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మల్లన్నసాగర్ నీళ్లతో చెరువు నింపింది. అప్పుడు మొత్తం మూడు ఎకరాలు నాటు పెడితే పంట మంచిగా పండింది. చెరువులో నీళ్లు ఉంటే మూడు ఎకరాల పొలం పారుతుండే. రైతుల బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలి.
-వెన్నెల మల్లారెడ్డి, రైతు, అంకంపేట, సిద్దిపేట రూరల్ మండలం, సిద్దిపేట జిల్లా
మిరుదొడ్డి, ఆగస్టు 3 :మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంటే గ్రామాల్లోని రైతుల బతుకులు బాగు పడుతాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉండగా రైతులు ఏ కాలంలో కూడా ఇబ్బందులు పడలేదు. వానకాలంలో వరి పంట సాగు చేయాలంటే రైతులకు భయం పట్టుకున్నది. మల్లన్నసాగర్‌లోకి నీళ్లు నింపి కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయాలి. ఇక్కడి రైతులందరూ బాగుపడతారు. లేదంటే అప్పుల్లో చిక్కుకొని ఇబ్బందులు పడక తప్పదు. ప్రభుత్వం వెంటనే మల్లన్నసాగర్‌లోకి నీళ్లు తేవాలి. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా వాగులు, చెరువును నింపాలి.
-మొగుళ్ల ఐలయ్య, రైతు, మిరుదొడ్డి,సిద్దిపేట జిల్లా