రామాయంపేట, ఫిబ్రవరి 24: కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తున్న మంత్రి మార్గమధ్యంలోని తూప్రాన్, రామాయంపేట, చేగుంట మండల కేంద్రాల్లోని గౌడ సంఘం నాయకులను కలిశారు. రామాయంపేటకు చేరుకున్న మంత్రిని స్థానిక గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అని కులాలను ఏకతాటిపై నడిపిస్తున్నారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుల సంఘాలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి కులానికి హైదరాబాద్ నగరంలో స్థలం ఇవ్వడంతో పాటు భవన నిర్మాణానికి నిధులు కూడా కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్ర పథకాలు కేంద్రంలో అమలవడం కోసమే బీఆర్ఎస్ పార్టీని పెట్టారన్నారు. బీఆర్ఎస్తో పార్టీ బలం మరింత పెరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న పథకాలను అమలుచేయడమే సీఎం కేసీఆర్ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో చేగుంటలో బాలరాజుగౌడ్, మాజీ ఎంపీటీసీ నార్సింగి మల్లేశంగౌడ్, రామాయంపేట గౌడ సంఘం నాయకులు ఈశ్వర్‌గౌడ్, పల్లె శ్రీనివాస్‌గౌడ్, రమేశ్‌గౌడ్, మధునాల స్వామిగౌడ్, సిద్ధిరాములు గౌడ్, సత్యంగౌడ్, యాదగిరిగౌడ్, భిక్షపతిగౌడ్, కన్నపురం కృష్ణాగౌడ్ తదితరులు ఉన్నారు.
చేగుంటలో..
తెలంగాణలో అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లి ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని ఈత వనాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులవృత్తులను కాపాడుకుంటున్నదన్నారు. కర్నాల్‌పల్లిలో పెంచుతున్న ఈత వనం రాష్ట్రంలోనే ఆదర్శమన్నారు. హరితహారంలో భాగంగా ఈత మొక్కలు పెంచుకుంటున్నామని, గౌడలను ఆదుకునేందుకు నీర పాలసీ తెచ్చామని అన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 4.20 కోట్ల ఈత మొక్కలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కుల వృత్తులను అవమానిస్తున్నారన్నారు. మత్స్య కార్మికులకు చేపల పెంపకం, యాదవలకు గొర్రెల పెంపకంతో పాటు ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. దుబ్బాక నియోజక వర్గానికి కావాల్సిన తాటి మొక్కలు పంపించాలని ఎంపీ కోరారు. గిరుక తాటి చెట్లు తక్కువ ఎత్తులో పెరగడంతో పాటు ఒక్కో చెట్టు రోజుకు 20 లీటర్ల కల్లు ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడెం వెంగళరావు, రణం శ్రీనివాస్‌గౌడ్, మెదక్ మున్సిపాల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, వైస్ చైర్మన్ పట్నం తానీషా, గ్రామ కమిటీ అధ్యక్షుడు వంటరి అశోక్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రాములుగౌడ్, బుచ్చంగారి ప్రవీణ్‌గౌడ్, కిషన్‌గౌడ్, యాదగౌడ్, ఎల్లాగౌడ్, చింతాకుల శేఖర్, గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.