గజ్వేల్, సెప్టెంబర్ 15: కాళేశ్వరం కాలువ పక్కన పొలాలున్న రైతులు మూడేండ్లుగా వరి సాగు పంట పండించుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రైతులు సుమారు 100 ఎకరాల వరకు కాలువ పక్కన భూముల్లో వరి సాగు చేశారు.కాలువల్లో ఉన్న కొద్దిపాటి గోదావరి జలాలతో నాటు వేసిన రైతులకు ప్రస్తుతం వరికి సాగు నీళ్లు అందించడం కష్టం గా మారింది. కాళేశ్వరం కాలువల్లోకి సాగునీళ్లు వదలక పోవడంతో వరి పొలాలు తడారి ఎండిపొతున్నాయి.
గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లి రైతులు 30 ఎకరాలు, బంగ్లావెంకటపూర్ గ్రామ రైతులు 70 ఎకరాల్లో వరిసాగు చేశారు. ఈ గ్రామాల మీదుగా వెళ్లే రామాయంపేట కాలువల్లోకి వర్గల్ మండలం జబ్బాపూర్ వద్ద సాగునీళ్లను వదిలితేనే సాగుచేసిన పంటలు చేతికొస్తాయి. మూడేండ్లుగా రామాయంపేట కాలువలోని నీళ్లపై ఆధారపడి రైతులు వరిసాగు చేసి పంటలు పండించుకున్నారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా రామాయంపేట కాలువలోకి జబ్బాపూర్ వద్ద గోదావరి జలాలను వదిలితేనే రైతులు సాగుచేసిన వరిని బతికించుకునే అవకాశాలున్నా యి. వారం రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి.
వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వరిసాగు చేసిన రైతులు పంటలు పండాలంటే ప్రస్తుతం రామాయంపేట కాలువలోకి గోదావరి జలాలను వదలాల్సిందే. ప్రభుత్వం స్పందించి రామాయంపేట కాలువలోకి నీళ్లు వదిలేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు సాగుకు నీళ్లు ఇచ్చిన విధంగానే ఈసారి కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. వందలాది ఎకరాల్లో సాగు చేసిన వరి పంట చేతికి రావాలంటే అధికారులు స్పందించాలి.
మక్తమాసాన్పల్లి, బంగ్లావెంకటపూర్, వీరానగర్ గ్రామాల రైతులం రామాయంపేట కాలువలోకి వచ్చే సాగునీళ్లపై ఆధారపడి మూడేండ్లుగా వరి పండిస్తున్నం. గతేడాది లాగే ఈ సీజన్లో కూడా వందలాది ఎకరాల్లో రైతులం వరిపంట వేసినం. గతంలో కాలువలోకి నీళ్లు వదిలారు. 15 రోజులుగా రామాయంపేట కాలువలోకి నీళ్లు వదలక పోవడంతో పొలాలు ఎండిపోతున్నారు. వానలు ఏమో కురవడం లేదు. ఇప్పటికైనా అధికారులు కాలువలోకి నీళ్లు వదిలి పొలాలను కాపాడాలి. – చిట్యాల రవీందర్, రైతు,మక్తమాసాన్పల్లి