సిద్దిపేట, మార్చి 7: ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భూమయ్యగారి కిషన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలంలో రైతు పరామర్శ కార్యక్రమాన్ని చేపట్టారు. సీతారాంపల్లి, అంకంపేట గ్రామాల్లో పర్యటించి నీళ్లు అందక ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ముందుచూపుతో పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందించి, ఎకడా ఎండిపోకుండా కాపాడిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన సమయంలో నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి రైతులను నట్టేట ముంచిందన్నారు. పొలాలు నెర్రెలు బారుతుంటే రైతులకు దుఃఖం వస్తున్న పరిస్థితి ఉందన్నారు. సరైన ప్రణాళిక లేక నీటిపారుదల శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట రైతులు నీళ్ల కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వ్యవసాయ అధికారులతో సమీక్ష జరిపి ఎండిపోయిన పంట పొలాల రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో మరో రైతు పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. మాజీ సర్పంచ్లు తవిటి ఉదయశ్రీ తిరుపతి, హంసకేతన్ రెడ్డి, దశరథం, తిరుపతి, నాయకులు పడిగే ప్రశాంత్ ముదిరాజ్, రాజశేఖర్, రాజశేఖర్ రెడ్డి, గజ్జల సంతోష్, దార మొగిలి, చెన్నారెడ్డి, భగవాన్ రెడ్డి, పడిగే నర్సయ్య, పడిగే కనకయ్య, గజ్జల జయంత్, శంకర్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.