రామాయంపేట, మార్చి 5 : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో కరెంట్ కష్టాలకు తోడు భూగర్భ జలాలు అడుగంటి యాసంగిలో సాగుచేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు నారాజ్ అవుతున్నారు. మాటిమాటిక కరెంట్ ట్రిప్ అవుతుండడం, భూగర్భ జలాలు అడుగంటి బోరు మోటర్లు కాలిపోతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతున్నది. రామాయంపేట మండలంలో యాసంగిలో 14 వేల ఎకరాల్లో రైతులు వరిపంట సాగుచేశారు. ప్రస్తుతం ఎటుచూసినా నెర్రెలు బారిన పొలాలు కనిపిస్తున్నాయి. రాత్రిపూట కరెంట్ ఇస్తుండడంతో పొలాలకు పారకం పెట్టడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన రైతు బండమీది రాములుకు చెందిన వరి పంట రెండున్నర ఎకరాల్లో ఎండిపోయింది. పొలం మొత్తం నెర్రెలు బారింది. వరుస తడులు పెడుదామన్నా బోరుబావి నుంచి నీరు తక్కువగా రావడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ వస్తూ పోతుండడంతో బోరు మోటర్లు కాలిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ రాత్రి 12గంటల తర్వాత త్రీఫేజ్ విద్యుత్ వస్తున్నదని రైతులు తెలిపారు. అప్పులు చేసి పంటలు సాగుచేస్తే తమకు అప్పులే మిగిలేలా ఉన్నాయని రైతులు వాపోతున్నారు.
ఇటీవల రెండు బోర్లు తవ్వించాడు. ఒక బోరు 720 ఫీట్లు, మరో బోరు 550 ఫీట్లు తవ్వించినా చుక్కనీరు రాలేదు. రైతు కుమ్మరి శేఖర్ తనకున్న రెండెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలు తీసుకుని యాసంగిలో వరి సాగు చేశాడు. రెండు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఐదెకరాల్లో మొత్తం పొలం ఎండిపోతున్నది. పంటను కాపాడుకోవడానికి ఇటీవల రెండుబోర్లు తవ్వించినా చుక్కనీరు రాలేదు. నీరందక వరి పంట పూర్తిగా ఎండిపోతున్నది. రూ.6 లక్షల వరకు అప్పులు అయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. మంజీరా నదిమీద చండూర్లో ఉన్న ఎత్తిపోతల ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి నీళ్లు అందిస్తే మా పొలాలు ఎండిపోయేవి కాదని తెలిపాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల ప్రాజెక్టు మరమ్మతులు చేయించాలని, చెరువులు, కుంటలు నింపి పంటలను కాపాడాలని కోరాడు.
బోరులో నీళ్లు తగ్గడంతో మా పొలమంతా నెర్రెలు బారి ఎండిపోయింది. నాలుగు రోజుల కిందట మా భార్య సిద్ధవ్వ చనిపోయింది. అదే బాధలో ఉన్న మాకు రెండున్నర ఎకరాల్లో పొలం ఎండిపోవడం మరింత బాధను గురిచేసింది. కరెంట్ ప్రాబ్లమ్, బోరులో నీళ్లు తగ్గడంతో మా పంట ఎండిపోయింది. మాకు ఏమి తోచడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే మా బతుకులు ఆగమైతాయి.