‘కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగ చెరువులు, కుంటలు నింపిండ్రు. కాల్వలకు నీళ్లు వదిలిండ్రు. పదేండ్లలో ఎన్నడూ సాగునీళ్లకు రంది లేకుండే. పంటలు బాగా పండినయి. కాంగ్రెస్ సర్కారొచ్చినంక పంటలు ఎండిపోతున్నాయి. ఈఏడు బాగా గోస ఉంది.ఇంత ముందెప్పుడు గిట్ల కరువు రాలే. ఇప్పుడు నీళ్లు ఇడుసేటోళ్లు లేరు. రైతులను పట్టించుకునేటోళ్లు లేరు. ప్రజాప్రతినిధులు మాదిక్కు రావడమే మానేశారు’.. అని జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండలాల రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట, ఏప్రిల్ 02(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, ధూళిమిట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో సాగునీరందక వేలాది ఎకరాల్లో వరిపంట ఎండిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో ఏటా సాగునీటిని విడుదల చేసి, ఈ ప్రాంత చెరువులు, కుంటలు పూర్తిగా నింపడంతో పుష్కలంగా పంటలు పండాయి. చెరువులు, కుంటలు, వాగులు మండుటెండల్లో జలకళతో ఉట్టిపడ్డాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎటుచూసినా నెర్రెలిడిన పొలాలు, బోసపోయిన చెరువులు, వాగులు కనిపిస్తున్నాయి. పొలాలు ఎండిపోవడంతో రైతులు పశువులకు వదిలేశారు. కొంతమంది రైతులు చివరి పంటను కాపాడుకోవడానికి అప్పులు తెచ్చి బోర్లు వేయిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ‘నమస్తే తెలంగాణ’ బృందం బుధవారం ధూళిమిట్టతో పాటు కూటిగల్, కొండాపూర్, బెక్కల్, లద్నూరు రిజర్వాయర్ కింద రేబర్తి, గాగిళ్లాపూర్, మర్మాముల, సలాక్పూర్, ధర్మారం,మద్దూరు గ్రామాలను సందర్శించి రైతుల గోస తెలుసుకుంది.
ఎక్కడ చూసినా పంటలు ఎండిపోయి రైతుల కండ్లలో కన్నీళ్లు కనిపించాయి. చేతికందిన పంట ఎండిపోవడంతో అప్పులు ఎలా తీర్చేది అంటూ రైతులు కన్నీటి పర్యంతం అయ్యారు. రైతులు పంటలను కాపాడుకోవడం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. బోరుబావుల తవ్విస్తున్నారు. ఒక్కో గ్రామంలో సరాసరి 15 నుంచి 20 వరకు బోర్లు తవ్వించారు. కొన్ని గ్రామాల్లో 50 నుంచి 60 వరకు బోర్లు తవ్వించారు.
ఒక్క ఆకునూరు గ్రామంలోనే ఈ సీజన్లో ఇప్పటికే 100కు పైగా బోర్లు తవ్వించినట్లు పరిశీలనలో తెలిసింది. వాగు పరీవాహక ప్రాంతమైన ఆకునూరు గ్రామ పరిస్థితి ఇలా ఉంటే, మిగతా గ్రామాల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చేర్యాల, ధూళిమిట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో 2600 ఎకరాల్లో వరిపంట ఎండిపోయింది. తమను ఆదుకోవడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు రావడం లేదని, సాగునీళ్లు ఇవ్వక పోవడంతోనే తమ పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో జలసవ్వడులు…
కేసీఆర్ ప్రభుత్వ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఎటుచూసినా గోదావరి జలసవ్వడులు కనిపించాయి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఎటుచూసినా ఎండిన చెరువులు, అడుగంటిన బోరుబావులు, డెడ్‌స్టోరేజీలో రిజర్వాయర్లు, ఎండిన పంటలు కనిపిస్తున్నాయి. ఏ ఊరికెళ్లి చూసినా పంటలను కాపాడుకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నారు. నీటికోసం రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇంత చేసినా పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే తపాస్‌పల్లి రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరింది. లద్నూరు రిజర్వాయర్‌లో చుక్కనీరు లేదు. పంట కాల్వలు పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉన్నాయి.
సాగునీటి పనులన్నీ పెండింగ్…
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు గోదావరి జలాలు విడుదల చేయాలని నాడు కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. కరువు ప్రాంతంగా పిలువబడే చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు గోదావరి జలాలు అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. లింకు కాల్వల నిర్మాణానికి రూ. 388.20 కోట్లు కేసీఆర్ మంజూరు చేశారు.
నిధులతో లింకు కాల్వల నిర్మాణాన్ని చేపట్టి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలను తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపాలని సంకల్పించా రు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదుల (చొక్కారావు ఎత్తిపోతల పథకం ) ఫేస్-2,3 ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపుతున్నారు. నాడు కేసీఆర్ ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం భారీగా నిధు లు కేటాయించి పనులు చేయించారు. దాదాపు 40శాతం మేర పనులు పూర్తయ్యాయి.
ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పనులకు బ్రేకులు పడ్డాయి. ఇక్కడి ప్రజాప్రతినిధులు పనుల పూర్తికి కృషి చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. పనులను పూర్తిచేసి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుండే..దాదాపుగా ఈ ప్రాంతంలో 1,29,630 ఎకరాలకు సాగునీరు అందేది. చేసిన పనులకు బిల్లులు కాంగ్రెస్ సర్కార్ ఇవ్వకపోవడం, భూసేకరణ చేయక పోవడంతో సాగునీటి పనుల్లో పురోగతి కరువైంది.
రిజర్వాయర్లు ఉన్నా నీళ్లు లేవు..
జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో తపాస్‌పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు రిజర్వాయర్లకు నీటిని నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్ల నుంచి నీళ్లందక చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతో పాటు జనగామ జిల్లాలోని బచ్చన్నపేట రైతులు అరిగోస పడుతున్నారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌లో చుక్కనీరు లేక బోసిపోయి దర్శనమిస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో ఏటా పంపింగ్ చేసి చెరువులు, కుంటలు నింపి పంటలకు సాగు నీరు అందించారు.రంగనాయకసాగర్ నుంచి కొన్ని గ్రామాలకు సాగునీరు అందించేవారు. ప్రస్తుతం ఎక్కడ చూసి నా ఎండిన చెరువులే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదు. ఫలితంగా రైతులు పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు పో స్తున్నారు. మరి కొంతమంది రైతులు బావుల్లో పూడిక తీయిస్తున్నారు.
కొత్తగా బోర్లు తవ్విస్తున్నారు. ఏం చేయలేని రైతు లు ఎండిన పంట పొలాలను పశువులకు మేతకు వదిలేస్తున్నారు. 0.5 టీఎంసీల సామర్ధ్యంతో లద్నూరు రిజర్వాయర్‌ను అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వినియోగంలోకి తెచ్చారు. ఈ రిజర్వాయర్ ద్వారా రైతులకు సాగునీటిని అందించా రు. దీంతో ప్రధాన చెరువులు నిండుకుండలా కనిపించా యి. ప్రస్తుతం లద్నూరు రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయకపోవడంతో బోసిపోయి కనిపిస్తున్న ది. చెరువులు ఎండిపోయాయి. పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్ కింద అదే పరిస్థితి ఉంది.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే..
నేను ఏడెకరాల్లో వరి పంట వేసిన. శివరాత్రి వరకు బాయిల నీళ్లు బాగానే ఉండే. చెరువు ఎండిపోంగనే బావి ఎండిపోయింది. బోరు కుండడన్నీ నీళ్లు మాత్రమే పోస్తున్నది. రోజుకొ క్క మడి కూడా పారుతలేదు. గ్రౌండ్ వాటర్ తగ్గి బోరుబావుల్ల నీళ్లు లేకుండా పోయినయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు, కుం టలు నింపిండు. కాల్వలకు నీళ్లు వదిలిండు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు నీళ్లకు గోసలేకుండే. అప్పుడు పంటలు మం చిగ పండినయి. ఇప్పుడు నీళ్లు ఇడుసేటోళ్లు లేరు. రైతులను పట్టించుకునేవాళ్లు లేరు.ప్రభుత్వం రైతుభరోసా కూడా సక్కగ ఇస్తలేదు.
-వంగపల్లి వెంకటయ్య, రైతు, రేబర్తి(మద్దూరు మండలం
పొలమంతా పగుళ్లు పట్టింది..
నేను నాలుగెకరాల్లో వరి పంట పెట్టిన. బోర్లల్ల నీళ్లు లేకుండా పోయినయి. పొలమంతా పగుళ్లు పడింది. నాలుగు రోజులకొక్కసారి మడికి తడి తిరుగుతంది. ఇంకా నెల రోజులయితే బయట పడుతం. ఈనెల రోజులు పొలం ఎట్ల పారుతదోనని భయపడుతున్నం. ఇంతకుముందు మంచిగనే పొలం పారేది. ఇప్పుడేమైందో బోరుబావులల్ల నీళ్లు మొత్తం పోయినయి. కొత్తగా బోరువేసిన. చెరువు, కుంటలు నింపితే బోరుబాయిలల్ల నీళ్లు ఉండేవి.బీఆర్ఎస్ ఉన్నప్పుడు నీళ్లకు గోసలేకుండే.
-చెవొళ్ల బాలరామయ్య, రైతు, కూటిగల్(ధూళిమిట్ట మండలం)
అప్పుడు చెరువులు, కుంటలు నింపేది
నేను రెండెకరాల్లో వరి పంట వేసిన. వరి పంటకు రూ. 50వేలు పెట్టుబడి పెట్టిన. ఈ ఏడాది పెట్టుబడి మీద పడ్డది. బోర్లు మొత్తం ఎండిపోయినయి. వరి పొట్టదశలో ఎండిపోతున్నది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మంచిగా చెరువులు, కుంటలు నింపడం వల్ల కరువు అనేది లేకుండా పోయింది. అప్పుడు పంటలు మం చిగా పండినయి. చెరువు, కుంటలు నింపితే బోరుబాయిలల్ల నీళ్లు ఉండేవి. ఇప్పుడు నీళ్ల సౌలత్ లేక ఇప్పుడు పంటలు ఎండిపోతున్నయి. పంటలు ఎండిపోవడం వల్ల అప్పులపాలయినం. ప్రభుత్వం ఆదుకోవాలే, లేకపోతే రైతులకు చావులే దిక్కవుతయి.
-ధరావత్ తౌరియా, రైతు, శిబ్బితండా(ధూళిమిట్ట మండలం)