చేగుంట,సెప్టెంబర్13: ఎరువుల కోసం రైతులకు దుకాణాల వద్ద పడిగాపులు తప్పడంలేదు.శనివారం యూరియా వస్తుందని సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి 9గంటలకు మెదక్ జిల్లా చేగుంట రైతు వేదిక వద్దకు టోకెన్ల కోసం రైతులు వచ్చారు.చెప్పులు,కొమ్మలు క్యూలో పెట్టి కార్యాలయ ఆవరణలో రాత్రి నుంచి నిరీక్షించారు.
యూరియా కోసం అధికారులతో వాగ్వాదం చేశారు.పోలీసుల పహారాలో కొంతమందికి మాత్రమే టోకెన్లు అందడంతో మరికొందరు రైతులు వెనుదిరిగారు.చేగుంటలో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున్న రావడంతో మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి డేవికుమార్,ఏవో హరిప్రసాద్ ఎరువులకు సంబంధించి దుకాణంలో రికార్డులను పరిశీలించారు.
కల్హేర్, సెప్టెంబర్ 13: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కృష్ణాపూర్లో పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. ఎరువుల బస్తాల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. యూరియా ఎక్కడికి వస్తుందో సమాచారం తెలుసుకొని అక్కడ వాలిపోతున్నారు.
మిరుదొడ్డి, సెప్టెంబర్ 13 : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని మల్లుపల్లి రైతు వేదిక క్లస్టర్ అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి యూరియా లారీ వచ్చింది. రుద్రారం గ్రామానికి మల్లుపల్లి రైతులు యూరియా కోసం వెళ్లారు. అక్కడ మల్లుపల్లి గ్రామానికి చెందిన రైతులకు యూరియా దొరక లేదు.
ఆగ్రహానికి లోనైనా మల్లుపల్లి రైతులు మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లి గ్రామ రహదారి పై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అక్కడికి చేరుకున్న దుబ్బాక సీఐ పి.శ్రీనివాస్ మల్లుపల్లి రైతులతో మాట్లాడి మీ మల్లుపల్లి గ్రామానికి యూరియా అందించడానికి తగు చర్యలు తీసుకుంటామని సముదాయించి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.