చిన్నకోడూరు, ఏప్రిల్ 12: వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేల ఇన్పుట్ సబ్సిడీ అంచాలని, అలాగే రైతులకు వానకాలం సాగుకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. చిన్నకోడూరు మండలంలోని గోనెపల్లి, ఇబ్రహీంనగర్, రామునిపట్ల, రామన్నపల్లి, ఎల్లాయిపల్లి, కొచ్చర్ల, కాసారంపల్లి, కొత్తపల్లి, చెలకలపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానకు నష్టపోయిన రైతుల పంటలు, మామిడి తోటలు, కూరగాయల పంటను శనివారం ఆయన సందర్శించి రైతులకు ధైర్యం చెప్పా రు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. వడగండ్ల వర్షంతో నష్టపోయి రైతులు చాలా ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ అని విమర్శించారు. చిన్నకోడూరు మండలంలో ఇప్పటిదాకా 5300కి పంట రుణమాఫీ అయ్యిందని, మరో 7352 మందికి రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. రైతుబీమా పథకం అమలు కావడం లేదన్నారు.
పంటల బీమా పత్తాలేకుండా పోయిందన్నారు. జిల్లాలోని వడగండ్ల వానకు 16 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. పంట చేతికొచ్చే సయమానికి నష్టం జరిగి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాలువల ద్వారా నీళ్లు ఇచ్చారని, రేవంత్ ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కనకరాజు, సదానందంగౌడ్, సీనియర్ నాయకులు మేడికాయల వెంకటేశం, ఏంరెడ్డి భూమిరెడ్డి, కొండం రవీందర్‌రెడ్డి, ఉమేశ్‌చంద్ర, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.