సిద్దిపేట, అక్టోబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా రైతులను మొంథా తుపాన్ భయం వెంటాడుతోంది. చేతికొచ్చిన పంట తుపాన్ వల్ల నేల రాలుతుంది.రైతులు ధాన్యాన్ని ఆరబెడుతుంటే వర్షాలకు తడిసిపోతున్నది. రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం అవుతుంది. మొంథా తుపాన్ ప్రభావంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్త్తరు వర్షాలు కురిశాయి.మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట జిల్లా రెడ్ అలర్ట్గా వాతావరణశాఖ ప్రకటించింది.
దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఓ వైపు మొంథా తుపాన్ ముంచుకొస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. జిల్లాకు చెందిన మంత్రులు కనీసం రైతుల కష్టాల గురించి పట్టించుకోవడం లేదు. రైతులు నష్టపోతుంటే వారికి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా అంతంతే ఉన్నారు. వర్షాలతో రైతాంగం ఇబ్బంది పడుతుంటే… మంత్రులు జిల్లాను వదిలిపెట్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో మునిగితేలుతున్నారు. రైతుల కంటే ఉపఎన్నికే ముఖ్యమా అని ప్రభుత్వంపై కర్షకులు మండిపడుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయి. ధాన్యం మీద కవర్లు కప్పుదామన్నా వాటిని కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదు. మట్టి కల్లాలు కావడంతో వర్షం వల్ల అంతాబురదమయంగా మారుతోంది. వర్షపు నీటికి ధాన్యం కొట్టుకుపోతుంది. రైతులు ఉండడానికి కనీసం వసతి సదుపాయం కూడా లేదు. పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తప్పా కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. తుపాన్ వల్ల కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వస్తున్నాయి. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం, దగ్గరపోయడం వరకే రైతులకు సరిపోతుంది.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సరిగ్గా కొనడం లేదని రైతులు మండి పడుతున్నారు. నత్తనడకన ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 5,03,800 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి కానీ ఇంత వరకు కేవలం 3,493 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మెదక్ జిల్లాలో 3,20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా కాగా 5,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 1,95,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంకాగా ఇంత వరకు కొనుగోలు చేయలేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1,132 కొనుగోలు కేంద్రాలు ఉండగా 150 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు షురూ చేశారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 15 నుంచి 20 రోజులు గడుస్తున్నా కాంటా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రావడం లేదు.
తుపాన్ ప్రభావం వల్ల ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంటలు నేలకొరుగుతున్నాయి. ముఖ్యంగా వరి పంట కోత సమయంలో నేలరాలడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వరి కోయడానికి తడిగా ఉండడంతో మిషన్లతో కోయడానికి వీలు కావడం లేదు. చైన్ మిషన్ల ద్వారా రైతులు వరికోతలు కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కోపించిన పచ్చి ధాన్యాన్ని ఆరబెట్టడంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం పచ్చిగా ఉండడంతో మొలకలు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరకక సాగు ఇబ్బంది అయింది ఇప్పుడేమో చేతికి వచ్చిన పంట అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర జేయబట్టే అని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వరి పంట నేలరాలడంతో రైతులకు నష్టం కలుగుతుంది. చేనుల్లో పత్తికింద రాలిపోతుంది. వర్షాల రూపంలో రైతులకు కన్నీళ్లు మిగులుతున్నాయి.