సంగారెడ్డి డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా రైతాంగం యాసంగి పంటల సాగుకు సన్నద్ధం అవుతున్నది. 2023-24 యాసంగి సీజన్లో 1,84,204 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అంచనాకు మించి పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. గత యాసంగిలో రైతులు 1.39 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తే 1.67 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రస్తుత సీజన్లో 1.84 లక్షల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లా రైతులు ఎక్కువగా వరి, జొన్న, శనగ పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతారు. అందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడంపై వ్యవసాయశాఖ దృష్టి పెట్టింది. రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎరువులు, విత్తనాలను నిల్వ ఉంచనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో 2023-24 యాసంగి సీజన్లో 1,84,204 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధిక విస్తీర్ణంలో వరి పంట సాగు కానున్నది. యాసంగిలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1,06,041 కాగా సాధారణ విస్తీర్ణానికి మించి పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇటీవల తుఫాను కారణంగా వర్షాలు కురియడంతోపాటు జిల్లాలో అందుబాటులో ఉన్న జలవనరులతో ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువగా 1,84,204 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు చెబుతున్నా రు. జిల్లాలోని ప్రాజెక్టులు, బోరుబావులు, చెరువుల్లో జలాలు పుష్కలంగా ఉన్నాయి. యాసంగి సీజన్లో 1,09,915 ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో వరి ఎక్కువ సాగు కానున్నది. 30,400 ఎకరాల్లో జొన్న, 6010 ఎకరాల్లో మొక్కజొన్న, 24,600 ఎకరాల్లో శనగ, 6916 ఎకరాల్లో కుసుమ, 300 ఎకరాల్లో వేరుశనగ, 430 ఎకరాల్లో గోధుమ, 274 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 85 ఎకరాల్లో నువ్వు లు, 5187 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 10,436 ఎకరాల్లో పంటలు వేశారు. 1296 ఎకరాల్లో జొన్న, 939 ఎకరాల్లో మక్క, 241 ఎకరాల్లో చెరుకు, 6298 ఎకరాల్లో శనగ, 1552 ఎకరాల్లో కుసుమ సాగుచేస్తున్నారు.
యాసంగి సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచనున్నది. ఈ సీజన్లో 45,207 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. 17,564 మెట్రిక్ టన్నుల యూరియా, 6020 టన్నుల డీఏపీ, 4343 టన్నుల ఎంఓపీ, 13,750 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 3530 టన్నుల ఎస్ఎస్పీ ఎరువులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈనెలలో జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ షాపుల ద్వారా రైతులకు 11,450 టన్నుల అన్ని రకాల ఎరువులు అందించనున్నారు. జిల్లాలో 24731 క్వింటాళ్ల వరి, 1642 క్వింటాళ్ల జొన్న, 379 క్వింటాళ్ల మొక్కజొన్న, 187 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. 5535 క్వింటాళ్ల శనగ విత్తనాలను వ్యవసాయశాఖ అందుబాటులో ఉంచింది.