సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 2: అభివృద్ధి, సం క్షేమం గేట్లు తెరవాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావుతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్లోని డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. క్వింటాలు వరికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్థపాలన కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితుల ఏర్పడినట్లు తెలిపారు మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం బోనస్ వంటి పలు అంశాల ఊసేలేదన్నారు. ప్రభు త్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశా రు. ఎకరానికి రూ.25 వేల పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. వరికి రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. బోనస్‌తోపాటు మిగతా పం టలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నారు. కాంగ్రెస్ గేట్లు తెరవడం కాదని అభివృద్ధి, సంక్షేమానికి గేట్లు తెరవాలని హితవు పలికారు. కాంగ్రెస్ సర్కారు విధానాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే 6వ తేదీన జిల్లాకేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింహులు, కొండల్‌రెడ్డి, ప్రభాకర్, మోహన్‌రెడ్డి, విఠల్, పుల్లారెడ్డి, నర్సింగ్‌రావు, అజీమ్, పరశురాం, గోపాల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మోహన్ పాల్గొన్నారు.