పుల్కల్, ఏప్రిల్ 13: కమీషన్ల కోసం సింగూర్ ప్రాజెక్టు కాలువ పనులను ఆలస్యం చేస్తున్నారని, నీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమాణిక్యంలో పొలం ఎండిపోవడంతో రైతు కృష్ణ తన పొలానికి నిప్పు పెట్టాడు. రైతును పరామర్శించిన అనంతరం చంటి క్రాంతికిరణ్ మాట్లాడారు.
అక్రమ సంపాదనకు అలవాటు పడిన మంత్రి దామోదరకు రైతుల ఉసురు తలుగుతుందని అన్నారు. కాలువ ద్వారా నీరు రాక వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ట్యాంకర్లతో పొలాలకు నీరు పోస్తున్నారని, అయినా మంత్రి మనసు కరగడం లేదన్నారు. ఎండిపోయిన పంటలకు బాధిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాం డ్ చేశారు. ఘనపూర్ ఆయకట్టుకు నీరు వదిలిన ప్రభుత్వం, సింగూరు కాలువ ద్వారా నీరు విడుదల చేయకపోవడం బాధాకరం అన్నారు. కాలువ మరమ్మతుల గురించి రైతులకు ముందే చెబితే పంటలు వేసేవారు కాదన్నారు.
రెండు నెలలుగా కాలువ పనుల్లో కనీస పురోగతి లేదన్నారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే అర్హత మంత్రి దామోదర, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సింగూర్ ఎడమ కాలువ కింద పంటలు వేసిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన కాలువ పనులు పూర్తి చేసి వెంటనే పంటలకు నీరివ్వాలని ప్రభుత్వాన్ని కాంత్రికిరణ్ డిమాండ్ చేశారు.