The Odyssey | హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంటున్న ఈ సినిమా.. ఈ వీకెండ్లో ఏకంగా రెండు ప్రతిష్ఠాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా నోలన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. ‘ది ఒడిస్సీ’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా $1.1 బిలియన్ గ్రాస్ వసూళ్లను అందుకుంది. దీంతో ఇప్పటివరకు క్రిస్టోఫర్ నోలన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న ‘ది డార్క్ నైట్ రైజెస్’ రికార్డును ఈ సినిమా అధిగమించింది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చైనా, జపాన్ వంటి కీలక అంతర్జాతీయ మార్కెట్లలో సినిమా పూర్తిస్థాయిలో విడుదల కాకముందే ఈ మైలురాయిని చేరుకుంది. ఈ రెండు మార్కెట్లలో విడుదలైన తర్వాత ‘ది ఒడిస్సీ’ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు ఐమ్యాక్స్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ది ఒడిస్సీ’తో ఆ బంధం మరో స్థాయికి చేరింది. ఈ సినిమా ఐమ్యాక్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్ల ద్వారా ఇప్పటివరకు $289 మిలియన్లు వసూలు చేసింది. దీంతో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘అవతార్’ జీవితకాలఐమ్యాక్స్ కలెక్షన్స్ అయిన $271 మిలియన్లను అధిగమించింది.
ఇది నోలన్‌కు మాత్రమే కాకుండా ఐమ్యాక్స్ చరిత్రలోనే ప్రత్యేకమైన విజయంగా మారింది. ‘ది ఒడిస్సీ’కి ఇంతటి ప్రత్యేకత రావడానికి మరో ప్రధాన కారణం ఉంది. ఈ సినిమా పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి చిత్రంగా నిలిచింది. భారీ స్థాయి విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, ప్రకృతి దృశ్యాలను సాధ్యమైనంత అద్భుతంగా చూపించేందుకు నోలన్ ప్రత్యేకంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను ఉపయోగించారు.థియేటర్లలో ముఖ్యంగా ఐమ్యాక్స్ 70mm స్క్రీన్లపై ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఐమ్యాక్స్ 70mm షోలు హౌస్‌ఫుల్ అవుతున్నట్లు సమాచారం. కొన్ని స్క్రీన్లలో సెప్టెంబర్ వరకు షోలు ముందుగానే బుక్ అయిపోవడం సినిమాకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.ఐమ్యాక్స్ కలెక్షన్లలో అమెరికా దేశీయ మార్కెట్ కీలక పాత్ర పోషించింది. దేశీయ మార్కెట్లో ఐమ్యాక్స్ వెర్షన్ ద్వారా $147.3 మిలియన్లు వసూలయ్యాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మరో $141.8 మిలియన్లు రాబట్టింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ఫార్మాట్కు ప్రేక్షకుల నుంచి ఎంతటి స్పందన లభిస్తుందో ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి.ఇక ‘ది ఒడిస్సీ’ విజయయాత్ర ఇంకా కొనసాగనుంది. చైనాలో ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. అక్కడ ఏకంగా 800 IMAX స్క్రీన్లలో సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.