Umar Khalid : ఉపా చట్టం కింద అరెస్టై జైళ్లో ఉన్న ఉమర్ ఖలీద్ రచించిన పుస్తకంపై చర్చ అంశం వివాదాస్పదంగా మారింది. ఉమర్ ఖలీద్ రచించిన ఫ్రాక్చర్డ్ కమ్యూనిటీస్ పుస్తకంపై ఆగష్టు 10, సోమవారం రోజు జేఎన్‌యూలో చర్చ జరపాలని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (జేఎన్‌యూఎస్‌యూ) నిర్ణయించింది. ఇందుకోసం అక్కడి ఎస్ఎస్ఎస్-1 ఆడిటోరియంను బుక్ చేసుకున్నారు. కానీ, దీనికి జేఎన్‌యూ అధికారులు అనుమతి నిరాకరించారు. ఇక్కడ చర్చ జరపడానికి వీల్లేదని సూచించారు.
అయితే, అధికారుల అనుమతి లేకున్నా తాము చర్చ జరిపి తీరుతామని జేఎన్‌యూఎస్‌యూ నేతలు అంటున్నారు. ఆదివాసీ దివాస్ (ట్రైబల్ డే) సందర్భంగా ఈ పుస్తకంపై చర్చ జరుపుతామని వారు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయత్రం 6.00 గంటల వరకు ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. అటు యూనివర్సిటీ అధికారులు చర్చకు అనుమతి నిరాకరించడం.. జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు కచ్చితంగా చర్చ జరుపుతామని ప్రకటించడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సరైన వివరాలు ఇవ్వకపోవడం వల్లే ఈవెంట్‌కు అనుమతి నిరాకరించామని యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. యూనివర్సిటీలోని వేదికలు, ప్రాంగణాలలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అనుమతి తప్పనిసరి అని అధికారులు అంటున్నారు.
ఏ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా సరైన వివరాలు సమర్పించాలని, పారదర్శకత ఉండాలని అధికారులు తెలిపారు. ఇక, అధికారులు ఆడిటోరియంలో చర్చకు అనుమతి నిరాకరించినప్పటికీ తమ చర్చ కొనసాగితీరుతుందని జేఎన్‌యూఎస్‌యూ నేతలు స్పష్టం చేశారు. ఒక హాల్లోకి అనుమతించనంత మాత్రాన విద్యార్థుల సంభాషణ, ప్రశ్నించడం, చర్చించే హక్కును అడ్డుకోలేరని విద్యార్థి నేతలు అన్నారు. చదువుకునేందుకు, ప్రశ్నించేందుకు విద్యార్థులు భారీ ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. అయితే, ఈ చర్చ సాగుతుందా.. లేదా అనే ఉత్కంఠ నెలకొంది.