దేశంలో షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం అవకాశం కల్పించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. అయితే 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆధిపత్య కులాలు, కాంగ్రె స్ నాయకులు కుట్రలతో ఆంధ్రరాష్ట్రంతో కలిపి, ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ర్టాల ముసుగులో తెలంగాణను బలవంతంగా విలీనం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలో ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయాలు, కుల గోత్రాలు కలిగిన బంజారా, లంబాడి, సుగాలి పేరుతో జీవనం కొనసాగిస్తున్న తెగలకు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఎస్టీ రిజర్వేషన్లు అమల్లో ఉన్నవి. కానీ తెలంగాణ ప్రాంత లంబాడీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎస్టీ రిజర్వేషన్ అమలుకు నోచుకోలేదు. 1956 నుంచి 1976 వరకు తెలంగాణ ప్రాంత బంజారాలు డీనోటిఫైడ్ ట్రైబ్‌గా, అనగా బీసీ క్యాటగిరీలో కొనసాగారు. ఒకే రాష్ట్రంలో బంజారాలకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ద్వంద్వ విధానం అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాటి తెలంగాణ ప్రాంత బంజారా పెద్దలు వాగ్య నాయక్, దీప్లాల్ చౌహాన్, లాల్‌సింగ్ నాయక్, డి.రవీంద్ర నాయక్, అమర్‌సింగ్ తిలావత్, రమణిబాయ్, మేఘనాథ్ చౌహాన్ లాంటి నేతలు హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు రెండు దశాబ్దాలపాటు వినతి పత్రాలు ఇచ్చారు, పోరాటాలు చేశారు. ఫలితంగా తెలంగాణ ప్రాంత లంబాడీలకు 1976లో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో బిల్లు ఆమోదించి, 1976లో తెలంగాణ ప్రాంత లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1976 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంత బంజారాలకు రెండున్నర దశాబ్దాలపాటు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ ఫలాలు అందకుండా ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్. 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనాభా ప్రతిపాదిక మీద ఎస్టీలకు, అనగా బంజారా, ఆదివాసీ, ఎరుకల, యానాదిలకు 4% (నాలుగు శాతం) రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్లు పెంచాలి. 1986లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 4% నుంచి 6% శాతంగా పెంచారు.
1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్, 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. 26 ఏండ్లు దాటినా రిజర్వేషన్లను పెంచలేదు. ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్‌లోని గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బంజారా రాష్ట్ర నాయకులు ఇందిరాగాంధీ వల్లే ఎస్టీ రిజర్వేషన్లు వచ్చాయని చెప్పుకొంటున్నారు. స్వర్ణోత్సవ బస్సు యాత్ర ప్రారంభించారు. కానీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచకుండా, 26 ఏండ్లపాటు అన్యాయం చేసిన పార్టీల మాయమాటలను ఎవరూ నమ్మరు.
ఆంధ్ర వలస పాలన నుంచి వేరుపడకపోతే తెలంగాణ ప్రజలకు విముక్తి ఉండదని మన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ స్వరాష్ట్రంతోనే సాధ్యమని కేసీఆర్ మలిదశ ఉద్యమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తండాలలో పర్యటించి, మాట ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత మాట నిలబెట్టుకొన్నారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచారు. బంజారా తండాలకు, ఆదివాసీ గూడేలకు స్వయంపాలన అందించారు. 3146 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని దేశంలోనే మొదటిసారి అధికారికంగా నిర్వహించడం, బంజారాహిల్స్‌లో ఆత్మ గౌరవ భవనాలు, సేవాలాల్ బంజారా భవనం, కుమ్రం భీం ఆదివాసీ భవనం నిర్మించారు. వీటిని గిరిజన జాతికి అంకితం చేసిన ఘనత కేసీఆర్‌ది. గిరిజన విద్యాభివృద్ధికి 92 గురుకుల పాఠశాలలు, విదేశీ విద్యకు 20 లక్షలు, వ్యవసాయ అభివృద్ధికి గిరి వికాసం, ప్రతి తండాకు గిరిజన గూడేలకు త్రీఫేస్ కరెంటు, గిరి పోషణ, గిరిజన ప్రాంత అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్, ఎస్టీ సబ్‌ప్లాన్, ఏకలవ్య పాఠశాల, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రాంత గిరిజనులకు చరిత్రాత్మకమైన 2022 సెప్టెంబర్ 17 రోజున హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎన్టీఆర్ స్టేడియంలో లక్ష మంది గిరిజన ప్రజల సమక్షంలో 6% శాతం నుంచి 10% శాతం వరకు ఎస్టీ రిజర్వేషన్ పెంచుతూ ప్రకటించారు. ఆ వెంటనే అన్ని రంగాల్లో అమలు చేసి చూపించిన మానవతావాది కేసీఆర్‌కు యావత్తు గిరిజన జాతి జీవితకాలం రుణపడి ఉంటుంది.
వ్యాసకర్త: రాష్ట్ర ట్రైకార్ మాజీ చైర్మన్
ఇస్లావత్
రాంచందర్ నాయక్
98498 25386