నారాయణఖేడ్/పెద్దమందడి/నర్సంపేట (ఖానాపురం)/నల్లగొండ సిటీ, సెప్టెంబర్ 16 : వానలు లేక పంటలు పోతున్నయ్.. కరెంటియ్యకపోతే ఎట్లా? అని రైతులు కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. కరెంట్ లేక.. నీళ్లు అందక చేతికందాల్సిన పంటలు కండ్ల ముందే ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం కూడా పలుచోట్ల రైతులు సబ్స్టేషన్లను ముట్టడించారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హన్మంత్‌రావుపేట్, మాద్వార్ గ్రామాల రైతులు హన్మంత్‌రావుపేట్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తులసీబాయి రాజు, మాజీ సర్పంచ్‌లు దత్తు, రాజునాయక్ మాట్లాడుతూ.. విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. హన్మంత్‌రావుపేట్, మాద్వార్ శివారులో పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నామని, ప్రస్తుతం పొట్టదశలో ఉన్న పంట కరెంట్ కోతల కారణంగా నీరందక ఎండు ముఖం పట్టినట్టు తెలిపారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. కాగా వనపర్తి జిల్లా పెద్దమందడితోపాటు వెల్టూరు గ్రామంలోని సబ్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు చేపట్టారు. అస్తవ్యస్త కరెంట్ సరఫరాతో రైతులు ఆగమవుతున్నారని రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆరోపించారు.

మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తరువాత కరెంట్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రోజుకు 12గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తూ కేవలం 7 గంటలే ఇస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. కరెంట్ కోతలను నిరసిస్తూ బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా కనగల్ మండలం తిమ్మనగూడెం సబ్‌స్టేషన్ ను రైతులు ముట్టడించారు. అనంతరం అక్క డే సాగర్‌రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తు న ట్రాపిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
యాప్‌ను రద్దు చేసి సరిపడా యూరియా దుకాణాల ద్వారా అందించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మంగళవారిపేటలో రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. మాజీ ఎంపీపీ వీ ప్రకాశ్‌రావు, నర్సంపేట ఏఎంసీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అసమర్థ విధానాల కారణంగా రైతులు అరిగోసపడుతున్నారని ఆరోపించారు.