– క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జైల్ బరో విజయవంతం
బూర్గంపహాడ్, ఆగస్టు 10 : కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్బరో కార్యక్రమం బూర్గంపహాడ్ మండలంలో సోమవారం విజయవంతమైంది. వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేపట్టారు. తొలుత మండల కేంద్రంలో కార్మికులు, కర్షకులకు జరుగుతున్న అన్యాయాన్ని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేస్తుండగా భగ్నం చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాస్తారోకో చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు నాయకులను లాక్కెళ్లి పోలీసు జీపులో స్టేషన్కు తరలించారు.
దీంతో ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు స్టేషన్ వద్దకు వెళ్లి రాస్తారోకోను భగ్నం చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం నాలుగు లేబర్కోడ్లు అమలుచేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని, విద్యుత్ సవరణ బిల్లు 2025 విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించారని దీంతో సులభతర వ్యాపారం పెట్టుబడిదారుల చేతిలో లాభాలు తెచ్చిపెట్టిందని విమర్శించారు. వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చి ఉపాధి కార్మికుల పొట్టకొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఎస్కే అబిద, సీఐటీయూ నాయకురాలు, ఐద్వా మండల కార్యదర్శి పాపినేని సరోజిని, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల కార్యదర్శి నాగేశ్వరరావు, మరియమ్మ, అప్పారావు, ప్రతాప్, ఆదూరి నర్సింహారావు, కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.

‘మోదీని గద్దె దింపాల్సిందే’