మెదక్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : రైతులకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందాలంటే పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో పంటల నమోదుకు మే 10వ తేదీ చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.
కొల్చారం మండలం అప్పాజీ పల్లి గ్రామంలో పంట నమోదు యాప్ పనితీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పంట పొలాలకు వెళ్లి రైతులతో మాట్లాడి నమోదు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల నమోదుకు వ్యవసాయ శాఖ గ్రామ స్థాయిలో ప్రైవేట్ సర్వేయర్ల ద్వారా డిజిటల్ పంట సర్వే చేపట్టినట్లు తెలిపారు. జియో రిఫరెన్స్ చేయబడిన కడాస్ట్రల్ మ్యాప్లు ఉన్న గ్రామాల్లో ప్రైవేట్ సర్వేయర్లు కేంద్ర ప్రభుత్వ యాప్లో పంట వివరాలు నమోదు చేస్తున్నారని చెప్పారు. కడాస్ట్రల్ మ్యాప్ అందుబాటులో లేని గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ యాప్లో పంట నమోదు చేస్తున్నారని వివరించారు.
ప్రతి రైతు పొలం వద్దకు అధికారులు ప్రత్యక్షంగా వెళ్లి ఫొటోలు తీసి అక్కడి నుంచే ఆన్లైన్లో నమోదు అప్లోడ్ చేసే విధంగా క్రాప్ బుకింగ్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు వేసిన పంట, వాటికి ఉన్న తెగుళ్ల వివరాలను గుర్తించి ఫోటోతో సహా యాప్లో నమోదు చేస్తున్నట్లు చెప్పారు. జియో ట్యాగింగ్ ద్వారా ఆ ఫొటో నిజంగా అదే సర్వే నంబర్ పొలం నుంచే అప్లోడ్ అయ్యిందా లేదా అన్నది వ్యవసాయ శాఖ గుర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,85,774 ఎకరాల పంట భూమిలో ఇప్పటి వరకు 39,827 ఎకరాలకు పంట నమోదు పూర్తయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.