రాష్ట్రంలో మూడురోజులుగా కురుస్తున్న వానలకు క్రమంగా చెరువులు నిండుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎగువన మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద కారణంగా కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణవాగు ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో కొనసా గుతున్నది. గురువారం కడెం ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తిన అధికారులు ఇలా వరద నీటిని కిందికి వదులుతున్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 30: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడు రోజులుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల తాత్కాలిక రోడ్లు తెగిపోవడం.. లోలెవల్ వంతెనల పైనుంచి వరద పారుతుండటంతో చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షం కురుస్తున్నది. కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ వాగు ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ప్రాంగణం ప్రధాన కారిడార్ పూర్తిగా వరదమయమైంది. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది మోకాళ్ల వరకు నిలిచిన నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దవాఖానలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో కూలిన ఇండ్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ఇండ్లు కూలిన వారు ధైర్యంగా ఉండాలని, బాధితులందరికీ ఇండ్లు ఇప్పిస్తానని భరోసా కల్పించారు. మంచిర్యాల జిల్లా సరిహద్దులోని ప్రాణహిత నదిలో 25 పడవలు కొట్టుకుపోతుండగా, మత్స్యకారులు అప్రమత్తమై మరపడవల సాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. మంచిర్యాల సమీపంలోని క్వారీ వంతెన ప్రమాదపుటంచుల్లో పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగడంతో 121 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాంఘి వాగులో 200 పశువులు కొట్టుకుపోగా, ఇందులో 150 పశువులు ఒడ్డుకు చేరగా, మిగతా 50 పశువులు గల్లంతయ్యాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి శివారులో 163 జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఇసుకవాగు బ్రిడ్జి వద్ద తాత్కాలిక డైవర్షన్ రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో మండలంలోని 26 గ్రామలతోపాటు ఛత్తీస్‌గఢ్ రాష్ర్టానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో రోజూ వాన ఉధృతి కొనసాగింది. పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్ ప్రహరీ కూలడంతో వరద వీర్లపల్లిలోని ఇండ్లలోకి వరద చేరగా, ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
రామగుండం రీజియన్ పరిధిలోని ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దబజార్లో భారీ వృక్షం కూలి మినీ వ్యాన్‌పై పడగా ఒకరికి గాయాలయ్యాయి. పలు చోట్ల ఇండ్లు ధ్వంసమయ్యాయి. వేములవాడలోని బుడగజంగాల కాలనీలోకి భారీగా వరద నీరు చేరగా, 25 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.
ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం 29 అడుగులకు చేరి, సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 16.30 అడుగుల వద్ద ప్రవహించి, గురువారం ఉదయం 6 గంటలకు 25.40 అడుగులకు చేరింది. మధ్యాహ్నం 12 గంటలకు 29 అడుగులకు చేరుకొని సాయం త్రం 4 గంటల వరకు నిలకడగా ఉన్నది. తర్వాత 28.50 అడుగులకు తగ్గింది.

హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): అల్పపీడన ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్తగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెండ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీచేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వచ్చే 12 నుంచి 18 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, కుదరకపోతే మధ్యాహ్నం 2 గంటల నుంచి విడతల వారీగా వాళ్లు ఇంటికి చేరుకునేలా చూడాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. గడిచిన 24 గంటల్లో (బుధవారం నుంచి గురువారం వరకు) అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌లో 18.35 సెంటీమీటర్లు, పెంచికల్‌పేటలో 16.54 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరిక నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యంగా వాగు లు, వంకల వద్ద ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరారు. అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి హరిచందన, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ములుగు జిల్లా వాజేడు మండలంలో వరదలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు

మంచిర్యాల జీజీహెచ్‌లో ప్రధాన కారిడార్‌లో నిండిన నీరు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లాల్‌గడ బ్రిడ్జి వద్ద విద్యార్థులను వాగు దాటిస్తున్న గ్రామస్తులు
