CPM | మెదక్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : డంపు యార్డ్ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఏవో యూనుస్‌కు వినతి ప్రతం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ శివారులో డంపు యార్డ్‌ను ప్రభుత్వం నిర్మిస్తున్నదని తెలిపారు. ఈ డంపు యార్డులోకి హైదరాబాద్ పట్టణంలోని వ్యర్ధాలు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యర్థాల వల్ల మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఈ వ్యర్థాల ద్రావణాలు నర్సాపూర్ అటవీప్రాంతంలోని పంది వాగు ద్వారా నర్సాపూర్ రాయరావు చెరువులోకి వస్తుందని తెలిపారు.
ఈ వ్యర్ధాల కాలుష్యం నర్సాపూర్ చెరువులోకి వస్తే ఆ చెరువు అలలు పారడం ద్వారా నర్సాపూర్ మండలంలోని ఆవంచ, రామచంద్రపూర్ చెరువులు గొలుసుకట్టు పద్ధతిలో నిండుతాయని వాపోయారు. చెరువుల ద్వారా వ్యవసాయ పొలాలు కలుషితమవుతాయని అన్నారు. నర్సాపూర్ చెరువు నిలువ నీటిని అనుకొని అర్బన్ పార్క్ అభివృద్ధి కొనసాగుతుందన్నని గుర్తుచేశారు. దీంతో అర్బన్ పార్క్ కూడా కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డంపుయార్డు నిర్మాణాన్ని సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అకాడమీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పారు. నర్సాపూర్ పట్టణంలో కూడా అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ డంపుయార్డు నిర్మాణం ద్వారా మెదక్, సంగారెడ్డి రెండు జిల్లాలకు నష్టం ఉన్నందున ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని, డంప్ యార్డుల నిర్మాణాన్ని నిలిపివేయాలని సీపీఎం తరఫున డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.