మునిపల్లి, నవంబర్ 13: సీసీఐకి పత్తి అమ్మాలంటే రైతులు జంకుతున్నారు. మునిపల్లి మండలంలోని సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేసేందుకు పత్తి మిల్లుల యాజమాన్యాలు ఆసక్తి చూపకపోవడంతో పత్తి మిల్లులు వెలవెలబోతున్నాయి. సీసీఐలో పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు రకరకాల నిబంధనలు పెట్టడంతో రైతులు పది పైసలు తక్కువ వచ్చినా ప్రైవేటుగా అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రైతులకు సీసీఐలో పత్తి అమ్ముకోవాలని ఉన్నా సీసీఐ అధికారుల నిబంధనలకు అవస్థలు పడుతున్నారు. సీసీఐకి పత్తి తీసుకువస్తే నిబంధనలకు అనుకులంగా లేదని, పత్తి లోడ్‌ను వెనక్కి పంపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోడ్ వెనకకు రావడం వల్ల ఖర్చులు పెరిగి నష్టపోతున్నామన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పత్తి మిల్లుల్లో సక్రమంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.