కంగ్టి, డిసెంబర్ 27: రైతులకు అందుబాటులో ఉంటూ వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పత్తిమిల్లుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనినే ఆసరాగా భావించిన పత్తిమిల్లు యాజమాన్యం రైతులను పట్టించుకోకుండా దళారులను ఆశ్రయించి వారినుంచి పత్తిని కొనుగోలు చేసి రైతులకు శఠగోపం పెడుతున్నది. రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన పత్తిని ఏదో వంక పెట్టి వెనక్కిపంపిస్తున్నది. దీంతో రైతులు దిక్కుతోచక తాము పండించిన పత్తిని దళారులకే విక్రయిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మూడు పత్తిమిల్లులు ఉన్నాయి. ఎన్కెమూరి గ్రామశివారులో ఉన్న పత్తిమిల్లు పూర్తిగా దళారులకు అడ్డాగా మారింది. కంగ్టి మండల దళారులే కాక కామారెడ్డి జిల్లాకు చెందిన దళారులు సైతం రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని ఇక్కడ విక్రయిస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని వారి వద్ద నుంచి పంటపాస్బుక్, ఆధార్‌కార్డులు సేకరించి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి కమీషన్ తీసుకుంటున్నారు.దీనికి పత్తిమిల్లు యాజమాన్యం సైతం మద్దతు లభించడంతో వారి వ్యాపారం సాఫీగా సాగుతున్నది. దీంతో దళారులు, పత్తిమిల్లు యాజమాన్యం, సీసీఐ సిబ్బంది లాభపడగా రైతులు మాత్రం నష్టపోతున్నారు.
బాసటగా నిలవాల్సిన యాజమాన్యం దళారులకు పెద్దపీట వేయడంతో అసలైన రైతు లు నష్టపోతున్నారు. రైతులకు చెందిన పత్తివాహనాలు మిల్లుకు వస్తే వాటిని గంటల తరబడి వేచిఉండేలా చేస్తున్నారు. దీంతో వారు రోజులపాటు మిల్లువద్దే ఉండక తప్ప డం లేదు. అదే దళారులకు చెందిన పత్తి డీసీఎం, లారీల్లో వస్తే వెంటనే బండ్లు ఖాళీ అవుతున్నాయి. వారి అక్రమాలు రైతుల కం డ్లముందే జరుగుతున్నాయి. సీసీఐ సిబ్బంది సైతం మిల్లుయాజమాన్యానికి వత్తాసు పలకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రైతులు విక్రయించడానికి మిల్లుకు తెస్తున్న పత్తి తేమశాతంలో అక్రమాలు జరుగుతున్నాయి. రైతుకు చెందిన పత్తి 8శాతం ఉం టున్నప్పటికి సీసీఐ సిబ్బంది మాత్రం 8.9, 9.2గా చూపించి వారికి అసలు ధరకన్నా తక్కువగా ధర చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాలు పత్తిపైన రూ.150 నుంచి 200 వరకు నష్టపోతున్నారు. తేమశాతం విషయంలో సీసీఐ సిబ్బందిని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే తీసుకురండి, లేకుంటే లేదు అనే దురుసుగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమే పలుమార్లు రైతులకు, సిబ్బందికి గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. అదే దళారులకు చెందిన పత్తి నీళ్లు కొట్టి తెచ్చినప్పటికీ వారి ఇచ్చే ముడుపులు సేకరించి వారికి సరైన ధర అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనేక రకాలుగా పత్తిరైతులు మోసపోతూ నష్టపోతున్నారు. ఇదంతా కొనసాగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. బుధవారం క్రిస్మస్ సెలవు ఉన్నప్పటికీ దళారులకు చెందిన పత్తి మిల్లులో ఖాళీ అవ్వడం కొసమెరుపు. ఈవిషయంపై కలెక్టర్ స్థాయి అధికారులు పట్టించుకొని విచారణ చేపడితే దళారుల దందా బయటపడే అవకాశం ఉంది.