గజ్వేల్, నవంబర్ 24: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీమంత్రి హరీశ్‌రావు సహకారంతో నిర్మించిన పత్తి(కాటన్) మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అలంకారప్రాయంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన పత్తి మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకొస్తే రైతులకు మేలు చేకూరనుంది. అన్నిసౌకర్యాలు, విశాలమైన ప్రదేశంలో నిర్మించిన పత్తి మార్కెట్ రెండేండ్లుగా రైతులకు అందుబాటులోకి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ ఆధీనంలో పత్తి మార్కెట్‌ను విశాలమైన ప్రదేశంలో సకల హంగులతో నిర్మించారు. నియోజకవర్గ రైతులను దృష్టిలో ఉంచుకొని అందరికీ అందుబాటులో ఉండేలా రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు చోటుచేసుకోకూడదనే ఉద్దేశంతో ఆర్అండ్ఆర్ కాలనీ ఏటిగడ్డకిష్టాపూర్ వద్ద రింగ్‌రోడ్డు పక్కనే 22ఎకరాల విస్తీర్ణంలో పత్తి మార్కెట్‌కు రూ.4కోట్లు ఖర్చుచేసి నిర్మించారు. ఇందులో రూ.1.60కోట్లను భూ పరిహారం కోసం, రూ.2.47కోట్లతో ఆఫీస్ భవనం, భారీ షెడ్, ఓపెన్ ప్లాట్‌ఫామ్, బాత్రూమ్లు, ఒక వైపు ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి చేసుకొని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు.
పత్తి మార్కెట్‌ను ప్రారంభించుకున్న తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రెండేండ్లలో పత్తి మార్కెట్‌ను రైతుల కోసం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు, మార్కెటింగ్ అధికారులు ఎలాంటి చొరవ తీసుకోలేదు. దీంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి నిర్మించిన పత్తి మార్కెట్ అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. పత్తి మార్కెట్ ప్రహరీ నిర్మాణం కోసం రూ.1.05 కోట్లు మంజూరు కావడంతో ఈ నెల 18న జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. రెండేండ్లుగా రైతులకు వినియోగంలోకి రాకుండా ఉన్న పత్తి మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పత్తి మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురావాలని ఇటీవల పత్తి మార్కెట్ ప్రహరీ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, కలెక్టర్‌ను సభ వేదికపై నుంచి కోరా. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో శ్రమించి నిర్మించిన మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకొస్తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది. మార్కెట్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు.
-ఎమ్మెల్సీడాక్టర్ యాదవరెడ్డి