Medak | టేక్మాల్, అక్టోబర్ 18: పత్తి సీసీఐకే విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండల పరిధిలోని బర్దిపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించి రైతులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి సాగు చేశారని తెలిపారు. జిల్లా పరిధిలోని సిద్దార్ధ జిన్నింగ్ మిల్ పాపన్నపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పింజ రకం బీబీ మోడ్ క్వింటాళుకు రూ.8110, బీబీ స్పెషల్ రూ.8080, ఎంఈసిహెచ్ రూ.8,010గా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. పత్తి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడానికి ఏఎంసీల వారిగా స్థానిక కమిటీలను నియమించుకుని రైతులు మద్దతు ధర పొందే విధంగా కృషి చేయాలన్నారు. లీగల్ మెట్రాలాజి అధికారులు తేమ కొలిచే యంత్రాలను తనిఖీ చేయాలని సూచించారు. సీసీ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.