హుస్నాబాద్, నవంబర్ 18: జిన్నింగ్ మిల్లులు మూత పడడంతో పత్తి రైతులు దిగులు చెందుతున్నారు. రెండు రోజులుగా పత్తి మిల్లుల యజమానులు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తిని ఎక్కడ విక్రయించాలో తెలియక రైతులు అయోమయానికి గురవుతున్నారు. సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరిగితే క్వింటాల్‌కు రూ. 8110 మద్దతు ధర వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ, కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టడంతో సకాలంలో కొనుగోళ్లు జరగక తీవ్ర జాప్యం జరుగుతోంది.
వచ్చిన కొద్దిపాటి పత్తిని మద్దతు ధరకు విక్రయించుకుందామని మిల్లుకు తరలించగా, అక్కడి నిబంధనలు రైతుకు ఆశనిపాతంగా మారాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సీసీఐ కొనుగోళ్లకు ఎంపిక చేసిన రెండు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు సజావుగా సాగలేదు. కేంద్రం విధించిన నిబంధనలు ఇటు రైతుకు, అటు మిల్లర్లకు నష్టం కలిగించే విధంగా ఉండటంతో మిల్లుల యజమానులు బంద్‌కు పిలుపనివ్వడం రైతులకు శాపంగా మారింది. మిల్లులకు తాళాలు వేడయంతో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
గతేడాది 10,350 క్వింటాళ్లు…
హుస్నాబాద్ పరిధిలోని నాలుగు జిన్నింగ్ మిల్లులకు సీసీఐ అనుమతి ఇవ్వగా, గతేడాది 2024 అక్టోబర్ 29న పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. నవంబర్ 14వ తేదీ వరకు 10,350 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఇందులో గోమాత మిల్లులో 2,223 క్వింటాళ్లు, ఆర్కే మిల్లులో 4,730క్వింటాళ్లు, ఎస్ఆర్ఆర్ మిల్లులో 1,628 క్వింటాళ్లు, బాలాజీ మిల్లులో 1,768క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 22న సీసీఐ కొనుగోళ్లు కేవలం రెండు జిన్నింగ్ మిల్లులకే అనుమతి ఇవ్వగా, 4,216క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొన్నారు. గోమాత మిల్లులో 1,820క్వింటాళ్లు, ఆర్కే మిల్లులో 2,395 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొన్నారు. అతివృష్టి వల్ల పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. వచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకుందామని పోతే నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయికోడ్‌లో రెండు రోజులుగా బంద్
రాయికోడ్, నవంబర్ 18: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని నాగ్వార్ గ్రామ శివారులోని జిన్నింగ్ మీల్లు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం
నాటికి రెండు రోజులైనా పత్తిని కోనుగోలు చేయకపోవడంతో రైతులు తమ పత్తిని జిన్నింగ్ మిల్లు వద్దే వాహనాలలో ఉంచారు. సీసీఐ పత్తి కొనుగోలు చేయక పోవడంతో రైతులు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.