సంగారెడ్డి, జనవరి 11(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు పార్టీ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను నియమించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి సమన్వయకర్తలు పనిచేయనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ సమన్వయకర్తలతో మాజీ మంత్రి హరీశ్‌రావు త్వరలో సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాంపై చర్చించనున్నారు. మున్సిపల్ సమన్వయకర్తల నియామకం వివరాలను ఆదివారం సంగారెడ్డి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ వెల్లడించారు. మున్సిపాలిటీల్లో సమన్వయకర్తలను నియమించడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
