భూపాలపల్లి రూరల్, మంథని, ఫిబ్రవరి 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో లంచం తీసుకుంటూ ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి శివారులో రైతు గోపాల్రావుకు చెందిన 14 ఎకరాల భూమిపై కాల్వ రాంరెడ్డి లోయర్ కోర్టులో 1984లో సివిల్ దావా వేశాడు. కిందిస్థాయి కోర్టు నుంచి ఈ కేసు జిల్లా సెషన్స్ కోర్టుకు రాగా ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో 2025 సెప్టెంబర్ 21న గోపాల్రావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఈనెల 10 న కోర్టు తీర్పుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పొందడానికి రైతు గోపాల్‌రావు .. కోర్టు స్టెనోగ్రాఫర్, ఇన్చార్జి ఏవో పాలకుర్తి సాయిచరణ్‌ను సంప్రదించగా రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా, చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రైతు గోపాల్‌రావు శుక్రవారం రూ.5 వేలను సాయిచరణ్‌కు ఇవ్వడానికి రాగా.. డబ్బులను ఆఫీస్ సబార్డినేట్ రజితకు ఇవ్వాలని వారు సూచించారు. అక్కడే ఉన్న మరో ఆఫీస్ సబార్డినేట్ సునీత ఏవో నన్ను తీసుకోమన్నారని చెప్పి రూ. 5వేలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు.
పుట్టపాకలో భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించాడు. డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి స బ్ రిజిస్ట్రార్ పీ రాజేందర్ 35వేలు డిమాండ్ చేశాడు. రషీద్ ద్వారా రాజేందర్ రూ.16,500 తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.