హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ముఠాగా ఏర్పడి ప్రతి పనికి లం చాలు పుచ్చుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా సీబీఎస్ఈ స్కూల్ ఎన్వోసీ విషయమై రూ. 70వేలు లంచంగా పుచ్చుకుంటూ ఇద్దరు విద్యాశాఖ సిబ్బంది ఏసీబీకి చిక్కారు. సాక్షాత్తు డైరెక్టరేట్‌లో పనిచేసే సూపరింటెండెంట్ ఫణిరాజ్, రంగారెడ్డి జిల్లా డీఈవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జీ శ్రీధర్‌ను ఏసీబీ వలపన్ని పట్టుకున్నది. చిన్న చేపలే దొరికాయని, ఈ వ్యవహారంలో కొన్ని పెద్ద చేపల హస్తం కూడా ఉన్నట్టు వా ర్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే ముగ్గురు విద్యాశాఖ సిబ్బంది ఏసీబీకి దొరికారు. ఇటీవల కిందిస్థాయి ఉద్యోగులే కాక డీఈవోలు సైతం ఏసీబీకి చిక్కుతున్నారు.
సీబీఎస్ఈ స్కూళ్ల ఎన్వోసీకి మూడు లక్షలు ఖర్చుచేయాల్సి వస్తున్నదని పాఠశాల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఇక స్టేట్‌బోర్డు గుర్తింపు కోసమైతే ప్రాథమిక పాఠశాలలకు రెండు లక్షలు, ఉన్నత పాఠశాలలకు నాలుగు లక్షల వరకు ఖర్చవుతున్నదట. కొన్ని బడులకైతే పైర్ ఎన్వోసీ లేకుండా బోగస్ పత్రాలు జోడించి అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాత సర్టిఫికెట్లు, లేదంటే ఒకేదాన్ని మూడు, నాలుగు బడులకు వినియోగించి అనుమతులిచ్చేస్తున్నారట. ఇ లాంటి వాటికి నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు వసూలు చేస్తున్నారు. టీచర్లపై సస్పెన్షన్ ఎత్తివేతలు, క్రమశిక్షణ చర్యలు, లాంగ్ లీవ్‌లో ఉన్నవారు, అనాథరైజ్డ్ సెలవుల్లో ఉన్న వారు తిరిగి విధుల్లో చేరేందుకు రూ.లక్షకు పైగానే వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు టీచర్ల వ్యక్తిగత సెలవులను మెడికల్ లీవులుగా మార్చే ందుకు ఒక్కొక్కరి నుంచి వేలల్లో పుచ్చుకుంటున్నారట. మెడికల్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు క్లియర్ చేయడం, సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వంటి వాటికి సైతం ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందేనట.
ఏదైనా ఫైల్ వెళ్తే చాలు విద్యాశాఖ సిబ్బంది కొర్రీలు పెట్టి సతాయిస్తుంటారట. ‘ఈ డాక్యుమెంట్లు లేవు.. ఈ పత్రాల్లేవు.. ఆ పత్రాల్లేవు.. సర్టిఫికెట్ల గడువు ముగిసింది’ అంటూ మెలిక పెడతారట. ఫైళ్ల పెండింగ్ సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కొన్ని ఫైళ్లు డీఈవో కార్యాలయం నుంచి ఆర్జేడీ ఆఫీసుకు, అక్కడి నుంచి డైరెక్టరేట్‌కు, సచివాలయానికి వెళతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు సచివాలయానికి వెళ్లిన 150 వరకు ఫైళ్లు పెం డింగ్లోనే ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అడిగినంత సమర్పించుకోలేదన్న కారణంతోనే వీటిని పెండింగ్‌లో పెట్టారని యాజమాన్యాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.
ఇక లంచాల వాటాల పంపకాల్లో తేడాలు అధికారులు, సిబ్బంది మధ్య గొడవలకు దారితీస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొంతకాలం క్రితం వరకు వరంగల్‌లోని ఓ ఆఫీసులో ఈ కారణంగానే ఫైళ్లను కిందిస్థాయిలోనే తిరస్కరించి పైకి పంపకుండా అడ్డుకున్నారన్న ప్రచారం ఉంది. వరంగల్ ఆర్జేడీ జోన్ పరిధిలోని జిల్లాల్లో రూ. లక్ష లక్షణంగా పుచ్చుకుని అక్రమ డిప్యూటేషన్లు ఇచ్చేస్తున్నారట. ఈ జోన్ పరిధిలోని హనుమకొండ జిల్లా డీఈవో ఆఫీస్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ముగ్గురు డీఈవోలు మారారు. గ్రేటర్ జిల్లాల్లో ప్రత్యేకించి ఓఆర్ఆర్ పరిసరాల్లో కొత్త స్కూళ్ల అనుమతుల దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతున్నదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఓ అధికారి కీలకమైన డీఈవో పోస్టులో పాగా వేశారని, ఆయన్ను అధికారులు బదిలీ చేయలేకపోతున్నారని సాక్షాత్తు విద్యాశాఖలోనే ప్రచారం జరుగుతున్నది.
విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ స్కూళ్లల్లో తనిఖీల పేరిట వసూళ్ల దందా నడుస్తున్నది. ఈ సమయంలో ప్రైవేట్ స్కూళ్లు రూ.15వేలు సమర్పించుకోవాల్సిందే. సార్‌ది సార్కే.. నాది నాకు కవర్ సిద్ధం చేసి ఉంచాలంటూ తనిఖీలకు వచ్చేవారు ఓపెన్‌గానే చెబుతున్నట్టు ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆఫీసుల్లో పనిచేసే కొందరు జూనియర్ అసిస్టెంట్లు ‘సార్ ఏం లేదా.. జర చూడండి.. తర్వాత మాతోనే పనులుంటాయి’ అంటూ ఒక్కో స్కూల్ నుంచి రూ.5వేల వరకు వసూళ్లు చేస్తున్నారట.