ఒకప్పుడు ఓ మోస్తరు షాపింగ్ తలబెడితే.. లిస్టు రాసుకోవడం, నాలుగు దుకాణాలు తిరగడం ఇలా ఉండేది! క్విక్ కామర్స్ అందుబాటులోకి వచ్చాక.. గడప దాటకుండానే, కోరుకున్న వస్తువులు కాలింగ్ బెల్ కొడుతున్నాయి. వీటికి ఏఐ టూల్స్ జతకట్టడంతో.. షాపింగ్ ట్రెండ్స్ వేగంగా మారిపోతున్నాయి. ఆన్లైన్ విప్లవానికి మించి ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్నది. వినియోగదారుల అవసరాన్ని అర్థం చేసుకుని, వారికి సరిపోయే ఉత్పత్తులను సూచించడం మొదలుకొని కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రతి అడుగులోనూ పెత్తనమంతా ఏఐ టూల్స్దే కనిపిస్తున్నది.
‘నా బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది?’, ‘ఈ చీరకు సరిపోయే ఆభరణాలు సూచించగలవా?’, ‘నా చిన్నారికి అనువైన స్కూల్ బ్యాగ్ ఎక్కడ దొరుకుతుంది?’ లాంటి ప్రశ్నలను అడిగిందే తడవుగా చాట్ జీపీటీ, గూగుల్ జెమిని, క్లాడ్ లాంటి ఏఐ టూల్స్ సమాధానాలు చెప్పేస్తున్నాయి. ఆ వ్యక్తి అభిరుచులకు తగ్గ సూచనలూ చేస్తున్నాయి. ధరల పోలిక, వినియోగదారుల సమీక్షలు, అందుబాటులో ఉన్న ఆఫర్లు, స్టాక్ వివరాలను పర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) లాంటి సాధనాలు మరింత వేగంగా విశ్లేషించి అందిస్తున్నాయి.
ఏఐని వాడుకోవడంలో ఇక వ్యాపార సంస్థలు కూడా వెనుకబడటం లేదు. జాస్పర్, కాపీ.ఏఐ లాంటి టూల్స్‌తో ప్రచార కంటెంట్, ఉత్పత్తుల సమాచారాన్ని ఆకర్షణీయంగా అందిస్తున్నాయి. వ్యాపార విశ్లేషణలు, విక్రయ ధోరణులను అందించడంలో మైక్రోసాఫ్ట్ కోపైలట్ అండగా నిలుస్తున్నది. మరోవైపు గూగుల్ ట్రెండ్స్, ఎక్స్‌ప్లోడింగ్ టాపిక్స్, సిమిలర్‌వెబ్ లాంటి విశ్లేషణ సాధనాలు వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పులను పసిగట్టి.. వ్యాపార వ్యూహాలను రూపొందిస్తున్నాయి.
ఇక షాపింగ్ అనుభవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడంలో ఏఐ చిత్రాలకు ప్రాధాన్యం అంతకంతకూ పెరుగుతున్నది. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన ఆకర్షణీయమైన దృశ్యాలు, ప్రకటనలను సోషల్ మీడియాలో వెదజల్లుతూ వినియోగదారులను కట్టిపడేయడంలో చాట్‌జీపీటీ ఇమేజ్ జెనరేషన్, అడోబ్ ఫైర్ైప్లె, మిడ్ జర్నీ లాంటి టూల్స్ సక్సెస్ సాధిస్తున్నాయి. మొత్తంగా సగటు మనిషి కొనుగోళ్లపై ఏఐ ప్రభావం ఊహించనంత వేగంగా పెరిగిపోతున్నది. ఏఐ కేవలం కొనుగోలు విధానాన్ని మార్చడం మాత్రమే కాదు.. వినియోగదారుడి షాపింగ్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తున్నది.