గద్వాల, ఆగస్టు 8 : జిల్లా రైతాంగాన్ని సాగునీటి కష్టాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురువడంతో జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయినా వానకాలం సాగుకు నీటిని విడుదల చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కించి చివరికి జూ రాల ప్రాజెక్టు కింది సాగునీరు ఇవ్వలేమని చేతులేత్తేశారు. రైతులు ప్రాజెక్టు వరద రావడంతో అధికారులు రిజర్వాయర్లకు, కాల్వలకు నీటిని విడుదల చేస్తారని, సాగు సంబురంగా చేసుకోవచ్చని పొలం బాట పట్టిన రైతన్నలకు ఇరిగేషన్ శాఖ అధికారు లు శుక్రవారం పెద్ద షాక్ ఇచ్చారు.
దీంతో రైతులు తీవ్రనిరాశకు గురై ఆందోళనకు చెందుతున్నారు. మూడురోజుల కింద జూరాల ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా రైతులకు సాగునీటికి అవసరమైన నీటిని విడుదల చేసేలా చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వానకాలం సాగుపై నీళ్లు చల్లారు. ఈ వానకాలం సీజన్లో రైతులకు సాగు నీటిని విడుదల చేయడం సాధ్యపడదని చెప్పడం తో రైతులకు ఏమి చేయాలో పాలు పోవడం లేదు.
వానకాలం సాగుపై ఇరిగేషన్ అధికారులు శుక్రవా రం ప్రకటన విడుదల చేశారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు తక్కువ నీటి తో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ కేశవరావు సూచించారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు వరద రా వ డం వల్ల చెరువులు నింపుకోవడానికి, తాగునీటి అవసరాలకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీటి విడుదల వరద ప్రవాహం త గ్గిన వెంటనే నిలిపివేస్తామని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు వ్యవసాయానికి కాదని , వరద తగ్గిన వెంటనే నీటి విడుదల బంద్ చేస్తామని ఈ విషయం రైతులు గమనించి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు.
ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రకటనతో జిల్లాలో సాగుపై సందిగ్ధం నెలకొన్నది. జిల్లాలో ఈ వానకాలంలో 3,78,239ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో పత్తి 2,13,450 ఎకరాల్లో, వరి 1,16,532 ఎకరాల్లో సాగు చేస్తాని అంచనా వేశారు. అయితే జిల్లాలో ఆగస్టు 15నాటికి పత్తి సాగు 1,55,996 ఎకరాలు, వరి 39,602 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. వరి సాగు జిల్లాలో పావల వంతు కూడా సాగు కాలేదు.
ప్రస్తుతం జూరాల ద్వారా నెట్టెంపాడ్కు నీటిని ఎత్తిపోయడంతో పాటు ర్యాలంపాడ్, గుడ్డెందొడ్డి తదితర రిజర్వాయర్లు నింపుకొన్న ఇరిగేషన్ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల తలాపున నీరు ఉన్నా నడిగడ్డ ప్రజలకు ఉపయోగం లే కుండా పోయింది. జూరాల కుడి, ఎడమ కాల్వ కింద సుమారు 1,02,200 ఎకరాలు, నెట్టెంపాడ్ లిఫ్ట్ కింద 2లక్షల ఎకరాలు, ఆర్డీఎస్ లింక్ ద్వారా 30వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రజా ప్రతినిధులు స్పందించి సీఎంతో మాట్లాడి నడిగడ్డ ప్రజలకు సాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నడిగడ్డ రైతులు కోరుతున్నారు.