హాలియా, ఆగస్టు 8 : కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనతోనే రాష్ర్టానికి అరిష్టం దాపురించిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి 12 గంటలు కూడా విద్యుత్తు సరఫరా చేయడంలేదని విమర్శించారు. విద్యుత్తు కోతలకు నిరసనగా శనివారం మాజీ ఎమ్మెల్యే భగత్ నాయకత్వంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాలియాలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కోదాడ- జడ్చర్ల 167 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
విద్యుత్తు శాఖ ఎస్ఈ నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా నోముల మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయానికి 18 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి కాశీవెళ్లి గంగానదిలో పుణ్యస్నానంచేసి కాశీవిశ్వేశ్వరుడితో పాటు దేవతామూర్తులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఈ నెల 10న నాగార్జునసాగర్ వరుణయాగంలో పాల్గొనాలని హితవుపలికారు.