నాని ‘ప్యారడైజ్’ సినిమాలోని ఓ పాట తెగ వైరల్ అవుతున్నది. రికార్డ్ స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నది. ఈ పాటకు గొంతు కలిపింది ఎవరో కాదు మన పాలమూరు మట్టి బిడ్డ ఎద్దుల జంగిరెడ్డి. చిన్నప్పుడే జానపద కళలపై మక్కువ పెంచుకున్న ఈ పాటగాడు ఎన్నో వేదికలపై గొంతెత్తి పాడాడు. తాజాగా ‘ఆయా షేర్’తో జెన్‌జీకి కనెక్ట్ అయ్యాను అంటున్న జంగిరెడ్డి తన ప్రయాణాన్ని బతుకమ్మతో షేర్ చేసుకున్నాడు.
జానపదాలకు పుట్టినిల్లు మా పాలమూరు. అందుకే బాల్యం నుంచే ఆ పాటల ప్రభావం నాపై పడింది. మాది బిజినేపల్లి మండలం మహాదేవ్పేట. అమ్మానాన్నలు వ్యవసాయం చేసేవాళ్లు. ఒక్కగానొక్క కొడుకుని కావడంతో నన్ను అల్లారు ముద్దుగా పెంచారు. జానపద కోలాటాలు, బతుకమ్మ పాటలు పాడుకుంటూ పెరిగాను. పాలిటెక్నిక్ చేస్తున్న సమయంలోనే సారా నిషేదం, అక్షర కిరణం, మహాలక్ష్మి లాంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటలు పాడేందుకు, నాటికలు వేసేందుకు ఓ బృందంగా ఏర్పాటై గ్రామాల్లో ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం.
నాన్న చనిపోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా బీటెక్ చేయాలన్న కోరికను విరమించుకున్నాను. అమ్మకు తోడుగా ఉంటూ కుటుంబ పోషణ కోసం పాటలు పాడటం ప్రారంభించాను. మా జిల్లాలో జనపదాలకు కొదువ లేదు. కానీ, అలాంటి పాటలు భవిష్యత్తులో అంతరించిపోతయేమో అనే భయం మొదలైంది. వాటిని బతికించాలనే ఆలోచనతో 1992లో జానపద గీతాలను క్యాసెట్ల రూపంలోకి తేవడం, కమల్ ఆడియోస్ లక్ష్మణన్న సహకారంతో వాటిని రికార్డ్ చేయడం ప్రారంభించాను. అలా నేను రికార్డు చేసిన పాటల్లో మొదటిది ‘గౌలిగూడ గల్లికాడ’ జానపదం ఇప్పటికీ ఫేమస్‌గా నిలిచింది.

ఆ భావన కలిగింది
ఈ సమయంలోనే ‘జానపద కళా స్రవంతి’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకొని బృందంతో కలిసి ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టాను. జానపదాలు, కోలాటం జనాల్లోకి తీసుకెళ్లడంలో మా బృందం చాలా కృషి చేసింది. 1993లో నంద్యాలలో రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో పాల్గొన్నాను. దానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
అందులో ‘ఏడ ఉన్నదో నవ్వుల నా ఎంకి’ పాటకు మొదటి బహుమతి, ‘కొంగు నడుము చుట్టవే చెల్లెమ్మ’ పాటకు రెండో బహుమతి అందుకున్నాను. బాలు గారి చేతుల మీదుగా బహుమతులను అందుకోవడంతో నాలో కూడా గొప్ప సింగర్ ఉన్నాడనే భావన కలిగింది. కానీ, సినిమాల్లో పాడాలనే ఆలోచన మాత్రం లేకుండే. పాటలు రాసుకుంటూ, పాడుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాను. తెలంగాణ వచ్చిన తరువాత విదేశాల్లో సైతం నా ప్రదర్శనలిచ్చాను. ఇప్పటివరకు నేను వెయ్యికిపైగా సినిమా, జానపదం, భక్తి గీతాలను ఆలపించుంటాను.
అస్సలు ఊహించలేదు
ఈ సమయంలోనే అనూప్ రూబెన్స్ పరిచయమయ్యాడు. మా సాన్నిహిత్యం వల్ల నితిన్ నటించిన ధైర్యం సినిమాలో ‘బైపీసీ బద్మాష్ పోరి’ నాతో పాడించాలనుకున్నాడు. కానీ, గొంతు కుదరకపోవడంతో వేరే వాళ్లతో పాడించాడు. పదేండ్ల క్రితం చరణ్ అర్జున్ మరో సినీ అవకాశం ఇచ్చాడు. ‘రాజారమ్యం’, ‘జయహో జనార్దన’ సినిమాల్లో నాతోనే పాడించాడు. సాహిత్యంలో నాకు మరో ఆత్మీయ మిత్రుడు కాసర్ల శ్యామ్. నా గొంతులోని బేస్ చూసిన శ్యామ్ దసరా సినిమాలో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాట పాడించాడు. ఆ పాట మాస్ జనాలకు చేరువైంది. అదే బేస్‌తో మరో సాంగ్ పాడాలని ప్యారడైజ్‌లో ‘ఆయా షేర్’ పాడించాడు. అది పాడేటప్పుడు ఆ పాట ఈ స్థాయిలో జనాల్లోకి వెళ్తుందని అస్సలు ఊహించలేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఓ ఊపు ఊపింది. నిజానికి నన్ను ఒక్క మెట్టు ఎక్కించింది ఈ పాటే. దీన్ని తెలుగుతో పాటు హిందీలోనూ పాడాను. ప్రస్తుతం పలు సినిమాల్లో పాడే అవకాశాలు వస్తున్నాయి.
ఫ్యూచర్ జానపదాలదే
జానపద కళాకారుడిగా ప్రయాణం మొదలుపెట్టి సినీ గాయకుడిగా ఎదుగుతున్న నాకు 2001 నుంచీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది. కేసీఆర్ మార్గదర్శకంలో రసమయి బృందంలో ఒకడిగా అనేక వేదికల్లో పాటలు పాడాను.‘సేతానమేడుంది రా తెలంగాణ సేన్లన్ని బీళ్లాయరా’ అంటూ మన గోసలను నాటి పాలకుల కండ్లకు కట్టాం. జానపదాలు జనాల్లో మరింతగా తీసుకువెళ్లడంలో భాగంగానే వాటిని భక్తి పాటలు, భజన పాటల్లో భాగం చేశాను. ఒకప్పుడు మన భాషంటే ఎగతాళి చేసిన రోజులనుంచి మన యాసలోనే సినిమాలు తీసుకునే రోజుకొచ్చాం. భవిష్యత్తులో సినిమాల్లో జనపదాల హవా కొనసాగుతుంది. నేను రికార్డ్ చేసిన పాటల్లో ‘ గొల్లమల్లమ్మ కోడలా, రామారామ ఎల్లమ్మ, శెనిగ శేండ్ల నిలబడి ’ పాటలు అత్యంత ఆదరణ పొందాయి. నా గొంతును ఈ తరం ఆదరిస్తుందో లేదోననే అనుమానం ఉండేది. ఆయా షేర్‌తో జెన్‌జీకి కనెక్ట్ అయ్యాను. ఈ జర్నీ మరింత జోరుగా సాగుతుందని నమ్ముతున్నా!
…? రాజు పిల్లనగోయిన