Medak | మెదక్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : పనులు చేసి బిల్లులు అడిగితే పోలీసులతో కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.. మేమేం పాపం చేశాం.. పాఠశాలల్లో పనులు చేసి బిల్లులు అడిగిన పాపానికి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఉందని కాంట్రాక్టర్లు, మాజీ ఎస్ఎంసీ చైర్మన్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మన ఊరు, మన బడి పథకం కింద పలు పాఠశాలల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చేపట్టిన పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రాక చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోతుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
గత డిసెంబర్ 3వ తేదీన జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాల తాళం తీయనియ్యకుండా ఎస్ఎంసీ చైర్మన్లు ధర్నా చేశారు. దీంతో పాఠశాల లోపలికి వెళ్లే విద్యార్ధులు గంట సేపు బయటే వేచి ఉన్నారు. అప్పట్లో కాంట్రాక్టర్లు, మాజీ ఎస్ఎంసీ చైర్మన్లపై మెదక్ పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం మెదక్ కోర్టుకు హాజరైన మాజీ ఎస్ఎంసీ చైర్మన్లు దశరథం, శంకర్, ముష్టి శ్రీనివాస్‌లు మాట్లాడుతూ…మన ఊరు – మన బడి పథకం కింద చేసిన పనికి సంబంధించి బిల్లులు రాలేవని డిసెంబర్ నెలలో మెదక్‌లోని బాలికల పాఠశాల ముందు ధర్నా చేశామన్నారు. బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి పనులు చేశామని చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని తెలిపారు. బిల్లులు రాలేదని ధర్నా చేస్తే పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయారు. తాము చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని అడిగితే కేసులు నమోదు చేసి కోర్టుకీడ్చారని వాపోయారు.
మెదక్ జిల్లాలో రూ.10 కోట్ల పెండింగ్ బిల్లులు
మెదక్ జిల్లాలోని మన ఊరు- మన బడి పథకం కింద వివిధ పాఠశాలల్లో కాంట్రాక్టర్లు, మాజీ ఎస్ఎంసీ చైర్మన్లు పనులు చేశారు. ఈ పనులను పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లులు రాలేదని వాపోయారు. మార్చి నెలలో జిల్లా కలెక్టర్‌ను కలిసి మన ఊరు-మన బడి కింద రూ.10 కోట్ల బిల్లులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ కూడా రాశారని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. కాంట్రాక్టర్లు దశరథం రూ.9.91 లక్షలు, మాణిక్యం రూ.16.14 లక్షలు, సాయిలు రూ.6.17 లక్షలు, మాజీ ఎస్ఎంసీ చైర్మన్లు ముష్టి శ్రీనివాస్ రూ.23.57 లక్షలు, భూపాల్ రూ.7.76 లక్షలు, లక్ష్మణ్‌యాదవ్ రూ.10.42 లక్షలు మన ఊరు, మన బడి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లుల విషయమై ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఫిర్యాదు చేశామని వాపోయారు.