టేక్మాల్/ అల్లాదుర్గం/ మెదక్ మున్సిపాలిటీ, మార్చి 12 : ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితకు వెంట క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం టేక్మాల్ మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఆది వారం ఎస్సై లింగానికి భారత జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లికాఅశోక్ బండి సంజయ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మల్లిక మా ట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నదన్నారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు నమోదు చేయ డం, విచారణకు పిలిపించడం ఇతర చర్యలు మానుకోవాలని సూచించారు. మహిళలపై కనీస బాధ్యత, మర్యాద లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. బండి సంజయ్ ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని ఎమ్మెల్సీ కవితకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్రస్థాయిలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు భక్తుల వీరప్ప, ఎంపీపీ చింత స్వప్నారవి, టేక్మాల్ గ్రామ సర్పంచ్ నాయికోటి సుప్రజాభాస్కర్ పాల్గొన్నారు.
సంగారెడ్డి – నాందేడ్ రోడ్డుపై దిష్టిబొమ్మ దగ్ధం
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలను నిరసిస్తూ అల్లాదుర్గం మండలా నికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంగారెడ్డి – నాందేడ్ 161వ జాతీయ రహదారి పై బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధ్దం చేశారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, సుభాష్, బలరాంరెడ్డి, శివరాం రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనలు ఉధృతం
జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ మహిళలను కించపరిచేలా బండి సంజయ్ మాట్లాడడం సిగ్గుచేటని భారత జాగృతి జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన మాటలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. మహిళలకు బీజేపీ ఇస్తున్న మర్యాద ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యాలను బండి సంజయ్ బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇబ్బందులకు గురి చేయ డం దారుణమని పట్లోళ్ల మల్లిక ఆవేదన వ్యక్తం చేశారు.