పటాన్చెరు, డిసెంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదని, తల్లిదండ్రులు పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా చూడాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన డీఎస్పీ భీమ్‌రెడ్డితో కలిసి పట్టణంలోని మైత్రీ మైదానంలో మూడు రోజులు నిర్వహించనున్న నియోజకర్గస్థాయి ప్రభుత్వ పాఠశాలల టోర్నమెంట్‌ను ప్రారంభించారు. బెలూన్స్ ఎగురవేస్తూ, పావురాలను వదిలి పోటీలను లాంఛనంగా ప్రారంభించి, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్ ఇచ్చిన గౌరవవందనాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. 34 జడ్పీహెచ్ఎస్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 5 ఎకరాల స్థలంలో 3 మినీ స్టేడియంలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడామైదానాలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామన్నారు. మైత్రీ మైదానాన్ని రూ.7.50 కోట్లతో ఆధునీకరించామన్నారు. నియోజకవర్గంలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ప్రభుత్వ పాఠశాలలకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ క్రీడల్లో ప్రతిభను చాటినవారికి అండగా నిలుస్తామన్నారు. అనంతరం పటాన్చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకర్గస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా గొప్పగా నిర్వహిస్తారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మశ్రీవేణుగోపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పానగేశ్, బీఆర్ఎస్ నాయకులు కొలన్బాల్రెడ్డి, చంద్రారెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి, మండల విద్యాధికారి పీపీ రాథోడ్, ఎండీ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.