మర్కూక్,సెప్టెంబర్4: లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, కోట్లాది ప్రజలకు తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ఇదికాదా అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మప్రాజెక్టు నుంచి వస్తున్న కాళేశ్వరం జలాలే గొప్పతనానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, గులాబీ అధినేత కేసీఆర్ ఉద్యమానికి ముందు నుంచే రైతుల గోస తీర్చడానికి ఆలోచనలు చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంజినీర్ల సహకారంతో నిర్మించినదే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు. కోటీ 50 లక్షల ఎకరాలకు నీటిని అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులను రాజులుగా నిలబెట్టిన కేసీఆర్ కృషితో గోదావరి జలాలు నేడు మల్లన్నసాగర్,రంగనాయకసాగర్,కొండపోచమ్మసాగర్,అన్నపూర్ణ,ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల్లోకి ప్రవహిస్తున్నాయన్నారు.
రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై అబద్ధపు ఆరోపణలు చేస్తూ బీజేపీతో కలిసి కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కాళేశ్వరం కుంగిపోయి ఉంటే ఈ రోజు జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఘోష్ కమిషన్ దొంగ కమిషన్‌గా అభివర్ణించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్, బీజేపీలు కలిసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, బీఆర్ఎస్ మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి,డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,జుబేర్‌పాషా,రాజమౌళి,వేడెం కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీలు,మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొనారు.