వర్గల్, మార్చి 23: వర్గల్ కేంద్రంగా ఆదివారం రాత్రి మట్టి మాఫియా చెలరేగింది. టీజీఐసీ ప్రాంతం నుంచి రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన బీఆర్ఎస్ వర్గల్ కార్యకర్తలు గౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులపై తిరగబడ్డారు.
దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య మాటామాట పెరిగి, వర్గల్ సర్పంచ్ కొడుకు, పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డిపై సీఐ చేయిచేసుకున్నారని కార్యకర్తలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడి భూనిర్వాసితులను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.50 లక్షలు చెల్లిస్తామని చెప్పి, నిలువునా మోసం చేసిందన్నారు. ఇప్పుడు లక్షల రూపాయిల విలువైన మట్టిని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని ఆరోపించారు. మట్టి మాఫియా అక్రమాలకు అడ్డుకట్టవేయాల్సిన పోలీసులు కాంగ్రెస్ నాయకులకు వంత పాడటమేమిటని వారు ప్రశించారు.
కొంతకాలంగా వర్గల్ మండలంలో జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలు శ్రుతిమించిపోతున్నాయని గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. వర్గల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఆయన సోమవారం పరామర్శించారు. టీజీఐసీకి భూకేటాయింపులో భాగంగా అప్పట్లో ధర్నా చేసిన కాంగ్రెస్ నాయకులకు సంఘీభావం చెప్పేందుకు వచ్చిన ఉత్తమ్‌కుమారెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, భూనిర్వాసితులకు వాగ్దానం ఇచ్చి, ఇప్పుడు తీరని అన్యాయం చేశారన్నారు.
బీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డిపై సీఐ చేయివేసుకోవడంపై కలెక్టర్, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలు ఆపకపోతే గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు వేలూరి కృష్ణారెడ్డి, స్వామి, రవి ఉన్నారు.