Social Media | సోషల్ మీడియా వినియోగం పిల్లల్లో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, చిన్న వయసులోనే సోషల్ మీడియాకు పరిచయం చేయడం వారి చదువుపై, ఏకాగ్రతపై, మెదడు అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై తాజాగా ఒక అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మధ్యపాఠశాల వయసులోనే సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించిన పిల్లల్లో గణితం, భాషా నైపుణ్యాలకు సంబంధించిన పరీక్షల్లో పనితీరు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రభావం ఉన్నత తరగతులకు వెళ్లే కొద్దీ మరింత స్పష్టంగా కనిపించినట్లు అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో 5వేల మందికి పైగా విద్యార్థుల డేటాను పరిశీలించారు. 7 నుంచి 16 ఏళ్ల వయసు వరకు వారి విద్యా ప్రగతిని పర్యవేక్షించి, సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించిన సమయం, గణితం, భాషా నైపుణ్యాలకు సంబంధించిన ప్రామాణిక పరీక్షల ఫలితాలను పోల్చారు. 83 శాతానికి పైగా విద్యార్థులు 9వ తరగతికి చేరుకునేలోపే, అంటే సుమారు 14 ఏళ్లలోపు, తొలిసారిగా సోషల్ మీడియా ఖాతాలను సృష్టించినట్లు గుర్తించారు.
6వ తరగతిలో, అంటే సుమారు 11-12 ఏళ్ల వయసులో సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించిన విద్యార్థులు 9వ తరగతి లేదా ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన వారితో పోలిస్తే 10వ తరగతికి చేరుకునే సమయానికి మాతృభాషా నైపుణ్యాల్లో 0.22 స్టాండర్డ్ డివియేషన్లు, గణితంలో 0.27 స్టాండర్డ్ డివియేషన్లు తక్కువ స్కోర్లు సాధించినట్లు అధ్యయనం వెల్లడించింది. అలాగే చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడిన విద్యార్థులు సెకండరీ పాఠశాలలో ఒక తరగతిని మళ్లీ చదివే అవకాశం ఎక్కువగా ఉండడంతోపాటు, అత్యుత్తమ మార్కులు సాధించే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా నేర్చుకునే విషయంలో మాత్రం పెద్దగా ప్రతికూల ప్రభావం కనిపించలేదు. దీనికి కారణం డిజిటల్ కంటెంట్‌లో ఇంగ్లిష్ విస్తృతంగా ఉండటమేనని అధ్యయనం సూచించింది. అయితే బీజగణితం, క్లిష్టమైన పఠన అవగాహన వంటి ఎక్కువ ఏకాగ్రత, తార్కిక ఆలోచన అవసరమయ్యే ప్రాథమిక విద్యా నైపుణ్యాలపై ప్రభావం ఎక్కువగా కనిపించింది. చిన్న వయసులో సోషల్ మీడియా వినియోగం చదువుపై ఎందుకు ప్రభావం చూపుతుందనే దానికి పిల్లల మెదడు అభివృద్ధి ఒక ముఖ్యమైన కారణంగా పరిశోధకులు పేర్కొన్నారు. 11-12 ఏళ్ల వయసులో మెదడులోని ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, నిర్ణయ సామర్థ్యాలకు సంబంధించిన భాగాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటాయి. ఈ సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు అందించే వేగవంతమైన కంటెంట్, నిరంతరం మారే వీడియోలు, నోటిఫికేషన్లు పిల్లలను తరచూ ఒక పని నుంచి మరో పనికి మారేలా చేస్తాయి. దీంతో గణిత సమస్యలను పరిష్కరించడం లేదా ఎక్కువ సమయం తీసుకునే పాఠ్యాంశాలను చదవడం వంటి పనులపై దీర్ఘకాలిక ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.
అలాగే, క్లిష్టమైన విషయాలను నేర్చుకునే సమయంలో మెదడు తాత్కాలిక జ్ఞాపకశక్తిలోని సమాచారాన్ని దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ తరచూ వచ్చే నోటిఫికేషన్లు, వేగంగా మారే సోషల్ మీడియా కంటెంట్ మెదడుపై అదనపు సమాచార భారాన్ని కలిగిస్తుందని అధ్యయనం పేర్కొంది. ఫలితంగా విద్యార్థులు నేర్చుకున్న విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం కష్టమయ్యే అవకాశం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ దగ్గరలో ఉండటం కూడా పిల్లల ఏకాగ్రతను ప్రభావితం చేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఫోన్లో ఎలాంటి నోటిఫికేషన్ రాకపోయినా, దాన్ని పట్టించుకోకుండా ఉండేందుకు మెదడు కొంత మానసిక శక్తిని వినియోగిస్తుంది. ఈ కారణంగా గణితంలో పనితీరు తగ్గడంలో స్మార్ట్ఫోన్ల విస్తృత వినియోగం 47 శాతం వరకు కీలకపాత్ర పోషించినట్లు అధ్యయనం పేర్కొంది. రాత్రివేళల్లో సోషల్ మీడియా వినియోగం మరో సమస్యగా మారుతోంది. నిద్రకు ముందు ఎక్కువసేపు ఫోన్ చూడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటోంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు తగినంత నిద్రపోకపోతే పగటిపూట నేర్చుకున్న విషయాలను జ్ఞాపకంలో నిలుపుకోవడంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నిద్ర సమయంలోనే మెదడు నేర్చుకున్న సమాచారాన్ని క్రమబద్ధీకరించి జ్ఞాపకాల్లో స్థిరపరుస్తుంది.
అందుకే పిల్లలను పూర్తిగా టెక్నాలజీకి దూరంగా ఉంచడం కంటే, సోషల్ మీడియా వినియోగాన్ని ఆలస్యం చేయడం, పరిమితులు విధించడం మరింత ఉపయోగకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. కనీసం 14-15 ఏళ్ల వయసు వరకు పిల్లలకు స్వతంత్రంగా సోషల్ మీడియా ఖాతాలు ఇవ్వకుండా ఉండడాన్ని పరిగణించవచ్చు. హోంవర్క్ చేసే సమయంలో ఫోన్‌ను సైలెంట్లో పక్కనే ఉంచడం కంటే మరో గదిలో పెట్టడం మంచిదని అధ్యయనం సూచిస్తోంది. అలాగే నిద్రకు కనీసం గంట ముందు ఫోన్, టాబ్లెట్ వంటి డిజిటల్ పరికరాలను పక్కన పెట్టే అలవాటు పిల్లలకు కల్పించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు. సోషల్ మీడియాకు బదులుగా పుస్తక పఠనం, క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, క్రాఫ్ట్ వంటి కార్యకలాపాలను పిల్లల్లో ప్రోత్సహించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. తక్షణ డిజిటల్ వినోదం కంటే కొంత సమయం, శ్రమ అవసరమయ్యే కార్యకలాపాలపై ఆసక్తి పెంచడం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, పట్టుదల వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయవచ్చు. చిన్న వయసులో ఏర్పడే డిజిటల్ అలవాట్లు భవిష్యత్తులో వారి చదువు, ఏకాగ్రతపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, పిల్లలకు టెక్నాలజీ వినియోగంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ, సరైన పరిమితులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.