న్యూఢిల్లీ: నల్సార్ న్యాయ యూనివర్సిటీ వివాదం కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) ఇవాళ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విద్యార్థులపై కఠిన నిర్ణయం తీసుకునే రీతిలో బీసీఐ జారీ చేసిన సర్క్యూలర్‌ను అత్యున్నత న్యాయ స్థానం తప్పుపట్టింది. విద్యార్థులకు నిరసన చేపట్టే హక్కు ఉందని కోర్టు పేర్కొన్నది. విద్యార్థులను ఎవరూ అడ్డుకోలేరని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. నల్సర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను ఆహ్వానించారు. కానీ ఓ వర్గం ఆయన రాకను వ్యతిరేకించింది. ఈ వివాదంపై బార్ కౌన్సిల్ కఠిన నిర్ణయం తీసుకున్నది. 2026 నల్సార్ వర్సిటీ గ్రాడ్యుయేట్ విద్యార్థులను బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేయరాదు అని బీసీఐ సర్క్యూలర్ జారీ చేసింది. ఆ సర్క్యూలర్‌పై విమర్శలు రావడంతో దాన్ని వాపస్ తీసుకున్నారు.
అయితే ఈ కేసులో ఇవాళ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను ఇచ్చింది. ఇది తనకు, విద్యార్థలకు సంబంధించిన అంశమని, బీసీఐకి ఈ వివాదంతో సంబంధం లేదని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహన ఉన్నారు. తనకు విద్యార్థులకు జరుగుతున్న చర్చలో.. బీసీఐ ఎలా జోక్యం చేసుకుంటుందని సీజేఐ అన్నారు. విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అన్నారు. తన ఆదేశాలపై బీసీఐ వివరణ ఇవ్వాలన్నారు. సీజేఐ కాంత్‌కు వ్యతిరేకంగా నల్సార్ వర్సిటీలో జరిగిన నిరసన ప్రదర్శన గురించి నివేదిక సేకరిస్తున్నామని బీసీఐ చైర్పర్సన్ మన్నన్ కుమార్ మిశ్రా తెలిపారు.